ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పలు ముఖ్య నగరాల్లో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సిటీల్లో మరింత విస్తరిస్తున్నాయి. అందులో భాగంగానే బెంగళూరులోనూ విస్తరణ కొనసాగుతోంది. అయితే, ఈ మెట్రోలో రెండు ముఖ్యమైన మార్గాలైన ఎయిర్ పోర్ట్ బ్లూ లైన్, పింక్ లైన్ లలో డ్రైవర్ లెస్ రైళ్లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ప్రజా రవాణా వ్యవస్థను అప్ గ్రేడ్ చేయడంలో భాగంగా ఈ కీలక ముందడుగు వేయబోతోంది.
ఇటీవల, BEML లిమిటెడ్ 5RS-DM అని పిలువబడే అధునాతన డ్రైవర్ లెస్ మెట్రో రైలు నమూనాను విడుదల చేసింది. నమ్మ మెట్రోకు సంబంధించి రాబోయే ఫేస్2, 2A, 2B కారిడార్ల కోసం ఈ రైళ్లను డెవలప్ చేశారు. ఈ నమూనాను బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మేనేజింగ్ డైరెక్టర్ J. రవిశంకర్ అధికారికంగా ఆవిష్కరించారు. ఇదే సమయంలో సదరు రైలుకు సంబంధించి టెస్ట్ రన్ ను కూడా నిర్వహించారు.
ఈ కొత్త మెట్రో రైలు ముఖ్యమైన ఫీచర్ డ్రైవర్ లేకుండా ప్రయాణించడం. ఇది కమ్యూనికేషన్ ఆధారిత రైల్వే నియంత్రణ (CBTC) టెక్నాలజీ ద్వారా మానీటర్ చేయనున్నారు. CBTC రైళ్లు నియంత్రణ వ్యవస్థతో నిరంతరం కాంటాక్ట్ లో ఉంటుంది. వేగం, రైళ్ల మధ్య దూరం, షెడ్యూలింగ్, భద్రతతో కూడిన ఆపరేషన్స్ ను నిర్వహిస్తుంది. ఇవన్ని పనులు క్యాబ్ లోపల డ్రైవర్ అవసరం లేకుండానే కొనసాగుతాయి.
ఇక డ్రైవర్ లెస్ రైళ్ల డిజైన్ లో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. రైళ్లు ఫైర్ సేఫ్టీ, క్రాష్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. రక్షణకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రైళ్లు రూపొందిచబడ్డాయి. అధునాతన సాంకేతికతతో పాటు, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందించనున్నాయి. ట్రైన్ సెట్లు సౌకర్యవంతమైన సీటింగ్ సహా ఆధునిక సౌకర్యాలను అందిస్తాయి. కోచ్‌ల మధ్య విశాలమైన గ్యాంగ్ వేల నుంచి ప్రయాణీకులు ఆహ్లాదకరంగా రాకపోకలు కొనసాగిస్తారు. ఇది రైలులో ప్రయాణీకులు అటు ఇటు కదలడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం USB ఛార్జింగ్ పోర్ట్ లు కూడా ఉంటాయి.
ఈ రైలు సెట్ల తయారీకి BEML కీలక ఒప్పందం చేసుకుంది. ఏకంగా రూ. 3,177 కోట్ల విలువైన అగ్రమెంట్ చేసుకుంది. డిజైన్, ఇంజనీరింగ్ పనులు సహా అన్ని ఈ కంపెనీయే చూసుకోనుంది. ఒప్పందం ప్రకారం, BEML ఎయిర్ పోర్ట్ పింక్ లైన్ కోసం 318 మెట్రో కార్లను అందిస్తుంది. అదనపు ఆర్డర్ల కారణంగా మొత్తం 396కి పెరుగుతుంది. ఈ రైళ్లను BEML 15 సంవత్సరాల వరకు రైళ్లను మెయింటెయిన్ చేస్తుంది. ఈ డ్రైవర్ లెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత బెంగళూరులో మెట్రో ప్రయాణం మరింత వేగవంతం కావడంతో పాటు సురక్షితంగా మారనుంది. ముఖ్యంగా నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే కీలక మార్గాలలో ఈ రైళ్లు ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Read Also: వందే భారత్ రైళ్లలో లోకల్ ఫుడ్స్, ఇక లొట్టలేసుకుంటూ తినేయొచ్చు!