First Indian Bullet Train Project: భారతీయ రైల్వేలు సరికొత్త పురోగతి సాధిస్తున్నాయి. అత్యధిక ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. టెక్నాలజీ పరంగానూ సరికొత్త మెరుగులు దిద్దుకుంటున్నాయి. వందేభారత్ లాంటి రైళ్లు భారతీయ రైల్వేలో ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. ఇప్పటి వరకు రైళ్లు భూగర్భంలో, సముద్రం మీద, లోయలను దాటుకుంటూ వెళ్లే రైళ్లను చూశాం. తొలిసారి సముద్ర గర్భంలో పరుగులు పెట్టే బుల్లెట్ రైలును చూడబోతున్నాం. ఇంతకీ ఈ రైలు ఎప్పుడు? ఎక్కడ? అందుబాటులోకి రాబోతుందంటే..
మహారాష్ట్ర-గుజరాత్ నడుమ సరికొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు
దేశ రైల్వే చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోంది మహారాష్ట్ర బుల్లెట్ రైలు ప్రాజెక్టు. మహారాష్ట్ర-గుజరాత్ ను కలిపే ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలువబోతోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL) తాజాగా డబుల్ లైన్ హై-స్పీడ్ రైల్వే కోసం టెస్టింగ్, కమీషనింగ్ తో సహా ట్రాక్ నిర్మాణ పనుల కోసం బిడ్‌లను ఆహ్వానించింది.
భూగర్భంలో.. సముద్రపు అడుగులో..
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కష్టం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని హై-స్పీడ్ కారిడార్ మొత్తం అండర్ గ్రౌండ్ లోనే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, థానేలోని శిల్పాటా మధ్య 21 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించనున్నారు. ఇందులో థానే క్రీక్ దగ్గర దేశంలోనే తొలి సముద్ర గర్భ సొరంగం కూడా నిర్మించనున్నారు. మొత్తం 21 కి.మీ మేర టన్నెల్ ను ఏర్పాటు చేయబోతున్నారు. 16 కి.మీ టన్నెల్ బోరింగ్ మెషీన్స్ (TBM) ద్వారా, మిగిలిన ఐదు కి.మీ న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) నిర్మిస్తున్నారు.
నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఇంక్లినో మీటర్లు, వైబ్రేషన్ మానిటర్లు, గ్రౌండ్ సెటిల్‌మెంట్ మార్కర్‌లు, నిర్మాణ స్థలాల దగ్గర, చుట్టుపక్కల టిల్ట్ మీటర్లతో సహా వివిధ జియోటెక్నికల్ పరికరాలను ఈ టన్నెల నిర్మాణ పనులకు ఉపయోగిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఏకంగా 394 మీటర్ల సొరంగాన్ని నిర్మించారు. ఈ సొరంగం భూగర్భంలో 25 నుంని 57 మీటర్ల లోతులో ఏర్పాటు చేస్తున్నారు.
మొదట్లో మహారాష్ట్రలో ఈ రైల్వే పనులు కాస్త నెమ్మదిగా కొనసాగినా ఇప్పుడు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 508 కి.మీ పరిధిలో ఈ రైల్వే ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. మహారాష్ట్ర (156 కి.మీ), దాద్రా- నగర్ హవేలీ (4 కి.మీ), గుజరాత్ (384 కి.మీ) మేర విస్తరించి ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఈ హై-స్పీడ్ కారిడార్ లో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కి.మీ ప్రయాణించనున్నాయి. ఒక దిశ నుంచి రోజుకు 35 రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్టు పనులు 2017లో ప్రారంభం కాగా, 2026 నాటికి తొలి బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.