Historic Nara Prison Hotel: జైలు అనగానే పెద్ద పెద్ద గోడలు, ఇనుప తలుపులు, చిన్న గదులు గుర్తుకొస్తాయి. కానీ, జపాన్ లోని నారా నగరంలో మాత్రం ఓ పాత జైలు ఇప్పుడు విలాసవంతమైన హోటల్‌గా మారిపోయింది. ఒకప్పుడు ఖైదీలు ఉన్న ఈ భవనంలో ఇప్పుడు లగ్జరీ సూట్లు, రెస్టారెంట్, విశ్రాంతి ప్రదేశాలుగా ఏర్పాటయ్యాయి. అయినా, పాత జైలు ఆనవాళ్లను మాత్రం పూర్తిగా తొలగించలేదు. హోషినోయా నారా ప్రిజన్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ హోటల్ లో మొత్తం 48 సూట్లు ఉన్నాయి. ఈ హోటల్ చరిత్రతో పాటు విలాసవంతమైన వసతి అనుభవాన్ని అందిస్తుంది.
ఈ భవనం మెయిజీ యుగంలో 1908లో నిర్మించబడింది. ఎర్ర ఇటుకలతో నిర్మించిన ఈ జైలును 2017 వరకు బాలల జైలుగా ఉపయోగించారు. జైలు మూసివేసిన తర్వాత భవనాన్ని అలాగే వదిలేస్తే కాలక్రమంలో పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో చారిత్రక నిర్మాణాన్ని కాపాడుతూ, దానికి కొత్త ఉపయోగం కల్పించాలనే ఉద్దేశంతో హోటల్‌గా మార్చారు.
ఈ జైలు భవనాన్ని హోటల్‌గా మార్చడం అంత ఈజీగా జరగలేదు. మొత్తం ప్రాజెక్టుకు సుమారు ఏడేళ్లు పట్టింది. జైలు ఐదు విభాగాల్లో నాలుగింటిని అతిథుల వసతి కోసం ఉపయోగించారు. గతంలో ఉన్న దాదాపు 500 చిన్న జైలు గదులను కలిపి కేవలం 48 విశాలమైన సూట్లుగా మార్చారు. ఒక్కో సూట్ ను తొమ్మిది, పది, పదకొండు పాత సెల్ లను కలిపి రూపొందించారు. అందుకే ఈ గదులు సాధారణ హోటల్ రూమ్ ల కంటే పొడవుగా, భిన్నంగా కనిపిస్తాయి.
హోటల్‌గా మారిన తర్వాత కూడా భవనం గతాన్ని పూర్తిగా మర్చిపోలేదు. అసలైన ఎర్ర ఇటుక గోడలు, ఉక్కు స్తంభాలు, పాత జైలు నిర్మాణంలోని కొన్ని భాగాలను అలాగే ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పాత ఇనుప తలుపులు కూడా కనిపిస్తాయి. అయితే, లోపల మాత్రం లగ్జరీ హోటల్‌కు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లాంజ్, కాఫీ స్టేషన్, మినీబార్, వాక్ ఇన్ వార్డ్ రోబ్, ప్రత్యేక బాత్ టబ్, షవర్ లాంటి సదుపాయాలు ఉన్నాయి.
ఇక్కడి సూట్లలో ప్రత్యేకత ఏంటంటే.. గది నిర్మాణం పాత జైలు చరిత్ర గుర్తుకు వచ్చేలా చేస్తుంది. కొన్ని సూట్లు పొడవుగా ఉండటంతో రైలు బోగీని పోలి ఉన్నాయని సందర్శకులు చెప్తుంటారు. సూట్లలో టీవీలు, గడియారాలు లాంటివి ఏర్పాటు చేయలేదు. గెస్టులు బయట ప్రపంచాన్ని మరచిపోయి.. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మార్పు కేవలం గదుల వరకే పరిమితం కాలేదు. ఒకప్పుడు నిర్బంధ గదిగా ఉపయోగించిన ప్రాంతాన్ని ఫ్రెంచ్ స్టైల్ రెస్టారెంట్‌గా మార్చారు. అదే సమయంలో ఈ ప్రదేశం చరిత్రను తెలుసుకునేందుకు మ్యూజియం, గైడెడ్ హెరిటేజ్ టూర్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక హోటల్ లో ఒక రాత్రి బస ధర సుమారు జపాన్ కరెన్సీలో JPY 147,000 నుంచి, అంటే దాదాపు రూ.85 వేల నుంచి ప్రారంభమవుతుంది. సూట్, బుకింగ్ తేదీలను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఈ హోటల్ లో బస చేసేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు.
Read Also: ఏడు కొండల మధ్య 750 ఏళ్ల ఖిల్లా.. చారిత్రక కోటకు ఇక కొత్త కళ!