Veligonda Project: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరు చెప్పగానే అడుగట్టిన భూగర్భ జలాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులే గుర్తుకు వస్తాయి. అలాంటి కరువు నేలలో కృష్ణా జలాలను తెచ్చి పసిడి పంటలు పండించాలనేది ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల. ఆ కలను సాకారం చేసే క్రమంలో పురుడుపోసుకున్నదే ‘వెలిగొండ ప్రాజెక్టు’. అయితే ఈ బృహత్తర ప్రాజెక్టు వెనుక ఒక మహానీయుడి సుదీర్ఘ పోరాటం, త్యాగం ఉన్నాయి. ఆయనే కమ్యూనిస్ట్ యోధుడు, ప్రజల మనిషి పూల సుబ్బయ్య. అందుకే ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ‘డాక్టర్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్’ అని నామకరణం చేసింది.
పూల సుబ్బయ్య కంభం ప్రాంతానికి చెందిన ప్రజా నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు, వైద్యుడు. డాక్టర్‌గా ప్రజలకు వైద్యసేవలు అందిస్తూనే వారి సామాజిక, ఆర్థిక ఇబ్బందులను దగ్గరుండి చూశారు. ప్రజల కష్టాలను తీర్చడానికి రాజకీయాలే సరైన మార్గమని నమ్మి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ద్వారా ప్రజా పోరాటాల్లోకి వచ్చారు. ఎర్రగొండ పాలెం, మార్కాపురం 1962, 1967, 1978లలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో గళమెత్తారు. అధికారాన్ని స్వప్రయోజనాల కోసం కాకుండా కేవలం ప్రజా సమస్యల పరిష్కారానికే అంకితం చేసిన అరుదైన నాయకుడాయన.
తొలి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాలను తీవ్రమైన కరవు, విషపూరిత ఫ్లోరైడ్ నీటి సమస్య వెంటాడేది. కాళ్లు, చేతులు వంకర్లు పోయి అక్కడి ప్రజలు వికలాంగులుగా మారుతున్న దారుణ పరిస్థితులు పూల సుబ్బయ్యను కదిలించాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వరద జలాలను వృథాగా పోనివ్వకుండా దట్టమైన నల్లమల కొండలను తొలిచి.. ప్రకాశం జిల్లాకు మళ్లించొచ్చన్న విఫ్లవాత్మక ఆలోచనకు ఆయనే శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాజీలేని పోరాటం చేశారు. ఊరూరా పాదయాత్రలు చేసి.. ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో చైతన్యం కల్పించారు.
శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్ట్ మంజూరు కోసం అసెంబ్లీలో నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవలం రాజకీయ నినాదాలకే పరిమితం కాకుండా ఇంజనీర్లతో మాట్లాడి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలు, డిజైన్లను సిద్ధం చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రాజెక్టు సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ‘వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి’ ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆయన అవిశ్రాంత ఒత్తిడి వల్లే ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
Also Read: అయ్యో ఎంత ఘోరం.. నడుముకు కూతురిని కట్టుకుని.. బావిలో దూకి తల్లి ఆత్మహత్య
వెలిగొండ ప్రాజెక్టు కల నెరవేరాలని, మెట్ట ప్రాంతాల తాగు, సాగునీటి ఎద్దడి తీరాలని తన జీవితాంతం ఆరాటపడిన పూల సుబ్బయ్య.. ప్రాజెక్ట్ పూర్తి కాకముందే కన్నుమూశారు. 1988 జూన్ 13న తుదిశ్వాస విడిచారు. అయితే పశ్చిమ ప్రకాశం దాహార్తిని తీర్చడానికి ఆయన చేసిన కృషి, త్యాగానికి, దార్శనికతకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. కాబట్టి ఒక నాయకుడు ప్రజల కోసం, నీటి కోసం చేసిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన గౌరవమే ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం. ఇకపై వెలిగొండ ప్రాజెక్టుతో పాటు పూల సుబ్బయ్య పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోనుంది.
Also Read: గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు