China-India Flights Resume After 6 Years: భారత్–చైనా మధ్య విమాన ప్రయాణాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఆరేళ్ల విరామం తర్వాత గ్వాంగ్‌జౌ–న్యూఢిల్లీ మార్గంలో సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 21, 2026 నుంచి ఈ మార్గంలో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య రాకపోకలకు మరింత ఉపయోగపనున్నాయి. ముఖ్యంగా వ్యాపార, పర్యాటకం, విద్య కోసం భారత్–చైనా మధ్య ప్రయాణించే వారికి ఉపయోగకరంగా మారనుంది.
చైనా సదరన్ ఎయిర్‌లైన్స్‌కు గ్వాంగ్‌జౌ ప్రధాన కేంద్రంగా ఉంది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ నగరం చైనా ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. ఢిల్లీ సర్వీసు తిరిగి ప్రారంభమైన తర్వాత దక్షిణాసియాలోని ఎనిమిది రౌండ్-ట్రిప్ మార్గాల్లో ఈ సంస్థ వారానికి 100కు పైగా విమానాలను నడపనుంది. ఢిల్లీ మార్గం పునఃప్రారంభం కావడంతో భారత్‌కు చైనా నుంచి విమాన కనెక్టివిటీ మరింత పెరగనుంది. రెండు దేశాల మధ్య నేరుగా ప్రయాణించే వారికి ఇతర నగరాల్లో విమానాలు మార్చుకోవాల్సిన అవసరం కూడా కొంత తగ్గుతుంది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2020లో భారత్, చైనా మధ్య సాధారణ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత కూడా ఈ సేవలు వెంటనే తిరిగి ప్రారంభం కాలేదు. తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య కొనసాగిన సుదీర్ఘ ప్రతిష్టంభన కూడా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపింది. అయితే, గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసుల పునఃప్రారంభం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో క్రమంగా మార్పులు కనిపిస్తున్నాయి. 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. 2025లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా మరోసారి భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాణిజ్యం, ప్రయాణాలు, ప్రజల మధ్య సంబంధాలను తిరిగి బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
భారత్ నుంచి చైనాకు విమాన అనుసంధానం కూడా క్రమంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఇండిగో షాంఘై–కోల్‌కతా మధ్య రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ నేరుగా విమానాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులతో పాటు ఇరు దేశాల వ్యాపార వర్గాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
Read Also: పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్‌పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?