Railway Compensation Case: రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బెర్త్ పై నుంచి కిందపడటం కూడా రైల్వే చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రయాణికుడు రైలు బయట పడాల్సిన అవసరం లేదని, కదులుతున్న రైలులోపలే ప్రమాదం జరిగినా దాన్ని అవాంఛనీయ సంఘటనగా పరిగణించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. పోస్ట్‌మార్టం నివేదికలో గుండెపోటు కారణంగా మరణం సంభవించిందని పేర్కొన్నప్పటికీ, ప్రయాణికుడు బెర్త్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిన వాస్తవాన్ని తోసిపుచ్చలేమని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు 2015 నవంబర్ 10న జరిగిన ఘటనకు సంబంధించినది. సంజీవ్ కుమార్ తన తండ్రి శ్యామ్ సింగ్ తో కలిసి ఇటావా నుంచి ఆగ్రా కంటోన్మెంట్‌కు రైలు నంబర్ 64157లో ప్రయాణిస్తున్నారు. ఆయన దగ్గర చెల్లుబాటు అయ్యే సెకండ్ క్లాస్ టికెట్ ఉంది. రైలు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్‌కు చేరువవుతున్న సమయంలో అకస్మాత్తుగా కుదుపు రావడంతో పై బెర్త్ పై ఉన్న సంజీవ్ కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయన స్పృహ కోల్పోయారు. రైల్వే వైద్యుడు పరీక్షించిన తర్వాత ఆయన మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
సంజీవ్ కుటుంబ సభ్యులు నష్టపరిహారం కోసం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మయోకార్డియల్ ఇన్ ఫార్క్షన్ అంటే గుండెపోటు కారణంగా మరణించినట్లు ఉందని పేర్కొంటూ ట్రిబ్యునల్ వారి దావాను తిరస్కరించింది. సంజీవ్ చెల్లుబాటు అయ్యే టికెట్‌తో ప్రయాణించిన నిజాయితీ గల ప్రయాణికుడనే విషయంపై ఎలాంటి వివాదం లేదని కోర్టు గుర్తించింది. అయితే, ఆయన మరణం రైల్వే చట్టం ప్రకారం ‘అవాంఛనీయ సంఘటన’ కిందకు వస్తుందా? అనే అంశంపైనే ప్రధానంగా విచారణ జరిగింది.
గతంలో ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలించిన హైకోర్టు.. ‘అవాంఛనీయ సంఘటన’ అంటే ప్రయాణికుడు తప్పనిసరిగా రైలు బయట పడాల్సిన అవసరం లేదని తెలిపింది. రైలు కదులుతున్న సమయంలో లోపలే ప్రమాదవశాత్తు పడిపోయినా చట్టంలోని నిబంధనలు వర్తించవచ్చని పేర్కొంది. ఈ కేసులో రైల్వే అధికారులు ఘటన జరిగిన రోజే తయారు చేసిన మెమో, పంచనామాలో సంజీవ్ రైలులోని సీటు నుంచి పడిపోయినట్లు నమోదు చేశారు. ఆయన తండ్రి ఇచ్చిన వాంగ్మూలం కూడా అదే విషయాన్ని బలపరిచింది.
మరణానికి గుండెపోటు కారణమని పోస్టుమార్టం చెప్పినంత మాత్రాన ప్రమాదవశాత్తు పడిపోయిన ఘటనను విస్మరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా సంజీవ్‌కు గతంలో గుండె సంబంధిత అనారోగ్యం ఉన్నట్లు చూపించే వైద్య ఆధారాలు కూడా రికార్డులో లేవని కోర్టు గమనించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, రైల్వే చట్టంలోని సెక్షన్ 124-ఎ కింద రైల్వేలకు కఠిన బాధ్యత ఉంటుందని హైకోర్టు పేర్కొంది. సంజీవ్ కుమార్ పై బెర్త్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడం రైల్వే చట్టంలోని సెక్షన్ 123(సి)(2) ప్రకారం ‘అవాంఛనీయ సంఘటన’గానే పరిగణించాలని హైకోర్టు తేల్చింది. దీంతో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేసి, నష్టపరిహారం మొత్తాన్ని నిర్ణయించేందుకు కేసును తిరిగి ట్రిబ్యునల్‌కు పంపింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందుకున్న రెండు నెలల్లోగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Read Also: కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!