దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ కి అమరావతి కేరాఫ్ అడ్రస్ గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దక్షిణ భారత దేశంలోనే అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా మార్చబోతోంది రైల్వే శాఖ. దాదాపు 1500 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మెగా రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది. నెక్కల్లు-పెదపరిమి సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది.
ఎర్రుపాలెం – అమరావతి మధ్య..
మెగా రైల్వే స్టేష్ తో పాటు.. దానికి అనుసంధానంగా రైల్వే లైన్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలి విడతలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతికి రైల్వే లైన్ నిర్మిస్తోంది. మొత్తం 56.53 కి.మీ. రైల్వే లైన్‌లో తొలి దశలో 27 కి.మీ. ఏర్పాటు చేయబోతున్నారు. దాములూరు-వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై 3.2 కి.మీ. పొడవున రైల్వేబ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారు. దీనికోసం తొలి దశలో 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి సెంట్రిక్ గా జరిగే రైల్వే పనులకోసం 2245 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. రాబోయే నాలుగేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
అమరావతి సెంట్రల్..
ఉత్తరాదికి, మధ్య భారత దేశానికి, దక్షిణాదికి ఒక వారధిగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలకు రైల్వే లైన్లు ఉంటాయి. బెంగళూరు, కోల్ కత, నాగపూర్, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, దేశంలోని ఇతర నగరాలకు సైతం కనెక్టివిటీ పెంచుతారు. ఇక కార్గో టెర్మినల్ మరో ప్రత్యేకత. సరకు రవాణాకోసం రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన మచిలీపట్నం పోర్ట్, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్ట్ లతో అమరావతికి లింక్ ఏర్పాటు చేస్తారు. మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ని ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేయబోతున్నారు.
అమరావతి ప్రాంతంలో ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయం, ఉండవల్లి కేవ్స్, అమరావతి స్థూపం, ధ్యాన బుద్ధ విగ్రహం.. ఇలా పర్యాటకంగా కూడా అమరావతి అభివృద్ధికి ఈ రైల్వే లైన్లు దోహదపడతాయని అంటున్నారు. అమరావతితోపాటు ఆంధ్రప్రదేశ్ లో 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
అమరావతి నగరానికి రైల్వేలైన్ ను 2017-18లోనే కేంద్రం మంజూరు చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు. పనులు కూడా ముందుకు కదల్లేదు. వైసీపీ ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి పూర్తిగా మూలన పడింది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు చకచకా ముందుకు కదులుతున్నాయి. ఈసారయినా అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి, అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఎన్నికలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందుగానే అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైల్వే టెర్మినల్ ప్రధాన ఆకర్షణగా మారుతుంది. అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్రం కూడా ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రి కూడా అమరావతి రైల్వే పురోగతిపై స్పందించారు.