Pithapuram : పిఠాపురం రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. కూటమి గట్టిగానే ఉన్నా.. కుమ్ములాటలు ఆగట్లేదు. నాగబాబు గిల్లుడు.. వర్మ అలుగుడు.. టీడీపీ, జనసేన శ్రేణుల గొడవలతో పిఠాపురం ఠారెత్తిపోతోంది.
లోకేశ్ వల్లే అధికారం..
పిఠాపురంలో జనసేన గెలుపు పవన్ వల్లే సాధ్యమైందంటూ జయకేతనంలో నాగబాబు రగిల్చిన చిచ్చు ఇంకా ఎగిసిపడుతూనే ఉంది. లేటెస్ట్‌గా టీడీపీ నేత SVSN వర్మ పరోక్షంగా గట్టి కౌంటరే ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ మంట కంటిన్యూ చేశారు వర్మ. కాకినాడలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజావేదికలో ఈ కామెంట్స్ చేశారు. టీడీపీ సారథిగా లోకేశ్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
వర్మ మాటలకు అర్థాలే వేరులే..!
వర్మ మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీని తామే గెలిపించామంటూ పవన్ కల్యాణ్ సైతం జయకేతనం సభలో అన్నారు. నాగబాబు.. తన తమ్ముడికి వంత పాడారు. వాళ్లిద్దరికీ ఒకేసారి ఇచ్చిపడేశారు వర్మ. లోకేశ్ పాదయాత్ర వల్లే టీడీపీ గెలిచిందంటూ వర్మ చేసిన కామెంట్స్.. పరోక్షంగా జనసేననే కార్నర్ చేశాయని అంటున్నారు.
వర్మ.. ఆచితూచి..
టీడీపీ నేత వర్మలో అసంతృప్తి ఉందనే ప్రచారమైతే జరుగుతోంది. అధిష్టానం ఆదేశాలతో తన పిఠాపురం టికెట్‌ను పవన్ కల్యాణ్‌కు త్యాగం చేశారు. జనసేనాని గెలుపు కోసం కష్టపడ్డారు. ఆ క్రెడిట్ ఇవ్వకపోగా.. పవన్‌ను చూసే ఓటేశారంటూ నాగబాబు అనడం వర్మను అసహనానికి గురి చేసిందని అంటున్నారు. ఎమ్మెల్యే గిరి పోయినా.. కనీసం ఎమ్మెల్సీ హోదా అయినా ఇస్తారని అనుకున్నారు. అది కూడా నాగబాబుకే కట్టబెట్టారు. వరుస పరిణామాలతో వర్మ ఇబ్బంది పడుతున్నా.. ఎక్కడా ఓపెన్‌గా తన అసంతృప్తిని వెళ్లగక్కింది లేదు. కానీ… ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్లు చేస్తూ కాక రేపుతూనే ఉన్నారు.
Also Read : ఆ మంత్రితో రోజా రహస్యంగా.. ఏంటి సంగతి?
పిఠాపురంలో ఎవరి పెత్తనం?
బయటకు అంతా బాగానే ఉన్నా.. లోలోన మాత్రం కుంపటి రగులుతూనే ఉంది. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య జగడం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఆధిపత్యం కోసం రెండు పార్టీల కార్యకర్తలు బహిరంగంగానే గొడవకు దిగుతున్నారు. ఇటీవల నాగబాబు పర్యటనలోనూ తోపులాట, నిరసనలు అదుపు తప్పాయి. పోలీస్ కేసుల వరకూ వెళ్లింది. పై స్థాయి నేతలే సంయమనం పాటించలేక నోటికి పని చెబుతుంటే.. ఇక కేడర్ ఆగుతారా? మా పార్టీ గొప్పంటే మా పార్టీ గొప్పని.. మా నాయకుడు తోపంటే.. మా లీడర్ గ్రేట్ అని.. రెండు పార్టీల కార్యకర్తలు గుడ్డలు చించుకుని వీరాభిమానం ప్రదర్శిస్తున్నారు. మరి, ఆ అభిమానం హద్దులు దాటుతుండటంతో.. పిఠాపురం రచ్చకు పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో?