Nepal Flood Survivors: ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ముందుగా కళ్లముందు మెదిలేవి విధ్వంసం, ఆవేదన మాత్రమే. కానీ అటువంటి విషాద సమయంలోనూ కొన్ని అద్భుతాలు చోటుచేసుకుంటాయి. నిరాశ పూరిత పరిస్థితుల్లోనూ ఆశల వెలుగులు నింపుతాయి. నేపాల్‌లో ఇటీవల సంభవించిన అకస్మిక వరదలు.. తన పరిధిలోని ఇళ్లను, మనుషులను తుడిచిపెట్టేశాయి. అయితే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రకృతి విధ్వంసాన్ని తట్టుకొని ప్రాణాలతో బయటపడిన ఆరు అద్భుతమైన సంఘటనలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నువాకోట్‌లోని త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగినప్పుడు 40 ఏళ్ల ప్రకాష్ తన ఇంటిని వరద చుట్టుముట్టడం చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వాహనాలు, భవనాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నా ఆ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. కుటుంబ సభ్యులు కొద్ది గంటల పాటు ఆ ఇంట్లోనే చిక్కుకుపోగా నీటిమట్టం స్వల్పంగా తగ్గగానే స్థానికులు వచ్చి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చుట్టూ వినాశనం కనిపిస్తున్నా దానికి అడ్డంగా నిలబడిన ఆ ఇల్లు.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రసువా జిల్లా తిమురే ప్రాంతంలో వరద విధ్వంసం తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులకు శిథిలాల కింద నుంచి ఏడుపు శబ్దం వినిపించింది. తవ్వి చూడగా మూడ్రోజుల పాటు బురద, రాళ్ల కిందే చిక్కుకుపోయిన ఆరేళ్ల చిన్నారి ప్రాణాలతో కనిపించింది. రెస్క్యూ టీమ్ ఆ పాపను సురక్షితంగా బయటకు తీసి మెరుగైన వైద్యం కోసం విమానంలో ఖాట్మండుకు తరలించింది.
విదూర్ ప్రాంతంలో పనిచేసే ఒక నిరుపేద కూలీ వరద ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండటానికి సమీపంలోని ఒక మామిడి చెట్టును గట్టిగా పట్టుకుని గంటల తరబడి గడిపాడు. ప్రవాహం నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన ఈ సాహసం.. ఆ సమయంలో ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడానికి పడిన వేదనకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న అతను.. ఆ భయానక రాత్రిని గుర్తు చేసుకుంటూ శివుడే తనను కాపాడాడని తెలిపాడు.
త్రిశూలి లోయలోని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దావాడి.. తన సమయస్ఫూర్తి ఏకంగా 1,643 మంది పిల్లల ప్రాణాలతో కాపాడాడు. అకస్మిక వరద తన పాఠశాల వైపు దూసుకొస్తోందని తెలుసుకున్న ఆయన.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైరన్ మోగించి పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారు స్కూల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే భవనం వరద నీటిలో కొట్టుకుపోయింది.
వరద ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను రక్షించుకోవడానికి నడిరోడ్డుపై పరుగులు తీసింది. ఆ క్రమంలో ఆమె కిందపడిపోయినప్పటికీ వెంటనే తేరుకుని పిల్లలను గట్టిగా పట్టుకుని సురక్షిత ప్రాంతం వైపు పరిగెత్తింది. ప్రకృతి కోపానికి ఎదురొడ్డి తన పిల్లలను కాపాడుకున్న ఆ తల్లి ఆరాటం ప్రతి ఒక్కరినీ కదిలించింది.
Also Read: కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!
రసువాలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతుండగా రెస్క్యూ బృందాలకు ఒక నెలన్నర వయసున్న పసికందు కనిపించింది. భయంకరమైన వరదను తట్టుకుని ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారిని రెస్క్యూ టీమ్ అత్యంత జాగ్రత్తగా సహాయక శిబిరానికి తరలించింది. ఆ పసిపాప నవ్వు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కొండంత ఆశను నింపింది.
Also Read: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?