TG Vehicle Registration: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. వాహనదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రజలు ఆర్టీఓ (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
గతంలో కొత్త వాహనం కొన్నప్పుడు కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే షోరూమ్ వద్ద జరిగేది. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ.. తాజాగా వాహనం కొన్న షోరూమ్ వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్యాలయాల్లో దళారుల బెడద కూడా తప్పుతుంది.
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సారథి (Sarathi)లో చేరడంతో రవాణా సేవలు మరింత సులభం కానున్నాయి. ప్రస్తుతం రవాణా శాఖకు సంబంధించిన దాదాపు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ కార్డుల జారీ నుంచి పర్మిట్ల వరకు అన్నీ డిజిటల్ మయం కావడంతో, ప్రజలు ఇంటి నుండే తమ పనులను పూర్తి చేసుకోవచ్చు.
రవాణా శాఖ కేవలం రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ (Electric Vehicle) పాలసీ, స్క్రాప్ పాలసీని కూడా పటిష్టంగా అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పించడం. పాతబడిన, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను స్వచ్ఛందంగా తొలగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు.
రవాణా శాఖలో చేపట్టిన ఈ ఆధునిక మార్పులు ప్రజలకు సేవలను మరింత చేరువ చేశాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. పారదర్శకమైన, వేగవంతమైన రవాణా సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ALSO READ:తల్లిదండ్రులే భారమయ్యారా? ఆస్తి కోసం అరాచకం చేసిన కొడుకుపై అధికారుల కొరడా
రవాణా శాఖలో సంస్కరణల్లో భాగంగా షోరూమ్స్ లోనే వాహనాల రిజిస్ట్రేషన్
ఇకపై ఆన్ లైన్ లోనే అన్ని రకాల సేవలు
– మంత్రి పొన్నం https://t.co/zmof6L86Vs pic.twitter.com/xHAuf8v58X
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2026