Doll Village: ఊహించుకోవడానికే చాలా వింతగా ఉంది కదూ.. ఒక ఊరంతా నిశ్శబ్దం.. కానీ అక్కడ వందల సంఖ్యలో మనుషులు కనిపిస్తారు. కాకపోతే, వారెవరూ మాట్లాడరు, కదలరు, శ్వాస తీసుకోరు. ఎందుకంటే వారంతా ప్రాణం లేని బొమ్మలు! అవును, ప్రపంచంలో కేవలం బొమ్మలు మాత్రమే రాజ్యమేలుతున్న ఒక వింత గ్రామం ఉంది. అక్కడి వీధులు, దుకాణాలు, బస్టాండ్లు, చివరికి పాఠశాలల్లో కూడా మనుషులకు బదులు బొమ్మలే దర్శనమిస్తాయి. ఈ వింత ప్రపంచం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న గుండెను పిండేసే కథేంటో తెలుసా?
ఆ వింత ఊరు ఎక్కడుంది?
ఈ వింతైన గ్రామం మరెక్కడో లేదు.. సాంకేతికతకు మారుపేరైన జపాన్ దేశంలోని షికోకు ద్వీపంలో ఉంది. దీని పేరు ‘నగోరో’. ఒకప్పుడు ఈ గ్రామం మిగతా ఊర్లలాగే కలకలలాడుతూ ఉండేది. కానీ కాలక్రమేణా ఉపాధి కోసం యువత పట్టణాలకు వలస వెళ్ళడం, వృద్ధులు కన్నుమూయడంతో ఈ ఊరు క్రమంగా జనాభా లేక వెలవెలబోయింది. ప్రస్తుతం ఈ గ్రామంలో బతికున్న మనుషుల సంఖ్య పట్టుమని పది మంది కూడా ఉండరంటే నమ్ముతారా? కానీ అక్కడ వందలాది బొమ్మలు మాత్రం జీవకళ ఉట్టిపడుతూ కనిపిస్తాయి.
బొమ్మల వెనుక ఉన్న అసలు కథ
ఈ గ్రామాన్ని బొమ్మల ప్రపంచంగా మార్చడం వెనుక అయానో సుకిమి అనే ఒక వృద్ధురాలి భావోద్వేగ కథ దాగి ఉంది. దశాబ్దాల క్రితం ఈ ఊరు విడిచి వెళ్ళిన సుకిమి, తిరిగి తన సొంత గ్రామానికి చేరుకునే సరికి ఊరంతా ఖాళీగా మారిపోయింది. తన కళ్ల ముందే తిరిగిన వారంతా దూరమవడంతో ఆమె తీవ్ర ఒంటరితనానికి గురైంది. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి, చనిపోయిన తన తండ్రి జ్ఞాపకార్థం ఆమె మొదటిసారిగా ఒక మానవ పరిమాణం ఉన్న బొమ్మను తయారు చేసి పొలంలో ఉంచింది. ఆ తర్వాతే ఆ ఊరి రూపురేఖలు మారిపోయాయి.
ఊరంతా విస్తరించిన బొమ్మల సామ్రాజ్యం
తండ్రి బొమ్మను చూసి మురిసిపోయిన సుకిమి.. ఆ తర్వాత ఊర్లో చనిపోయిన, వలస వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరి జ్ఞాపకంగా బొమ్మలను తయారు చేయడం ప్రారంభించింది. అలా ఇప్పటివరకు ఆమె దాదాపు 400 కి పైగా పెద్ద బొమ్మలను తయారు చేసింది. విడ్డూరం ఏమిటంటే, ఈ బొమ్మలన్నింటికీ స్థానిక రిజిస్టర్‌లో పేర్లు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఆ ఊర్లో మనుషుల జనాభా కంటే ఈ బొమ్మల జనాభాయే చాలా ఎక్కువ.
నిశ్శబ్ద నగరంలో సజీవ దృశ్యాలు
ఈ ఊరిలోకి అడుగుపెడితే ఒక హారర్ సినిమా చూస్తున్న భావన కలగక మానదు. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు, రోడ్డు పక్కన ముచ్చట్లు పెట్టుకుంటున్న వృద్ధులు, పొలాల్లో పనిచేస్తున్న రైతులు.. ఇలా ప్రతి చోటా బొమ్మలే కనిపిస్తాయి. ఒక మూతపడిన పాఠశాలలోకి వెళ్తే.. క్లాస్ రూమ్ నిండా విద్యార్థులు, పాఠాలు చెబుతున్న టీచర్ బొమ్మలు కూడా ఉంటాయి. దూరం నుండి చూస్తే నిజంగా మనుషులే కూర్చున్నారా అనేంత అద్భుతంగా, సజీవంగా వీటిని మలిచారు.
గూగుల్ మ్యాప్స్‌లో వైరల్..
ఒకప్పుడు ఎవరికీ తెలియని ఈ మారుమూల గ్రామం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యమా అని నగోరో స్కేర్‌క్రో విలేజ్‌గా ఇది విపరీతంగా పాపులర్ అయింది. కేవలం ఆ బొమ్మలను చూడటానికి, వాటితో ఫోటోలు దిగడానికి ప్రపంచ దేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మనుషుల జ్ఞాపకాలను బొమ్మల రూపంలో సజీవంగా ఉంచిన ఈ వింత గ్రామం.. నిజంగా వింతలకే వింత ఉంది.
Also Read: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!