Hidden Water Deep Inside Earth: భూమి అనగానే.. మనకు సముద్రాలు, నదులు, సరస్సులు, భూగర్భ జలాలు గుర్తుకొస్తాయి. కానీ, మన కళ్లకు కనిపించని భూమి అంతర్భాగంలో కూడా భారీగా జలసిరి దాగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి వేల కిలోమీటర్ల లోతున ఉన్న ఖనిజాల నిర్మాణంలో ఈ నీరు బంధించబడి ఉన్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది. ‘నేచర్ జియోసైన్స్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. భూమి మాంటిల్‌లోని 660 నుంచి 2,900 కిలోమీటర్ల లోతు వరకు నీటికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ నీరు మనం సాధారణంగా చూసే ద్రవ రూపంలో ఉండదు. కొన్ని ప్రత్యేక ఖనిజాల నిర్మాణంలో భాగంగా బంధించబడి ఉంటుంది.
భూమి అంతర్భాగంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నీరు భూమి ఉపరితలంపై ఉన్నట్లుగా నదులు, సముద్రాల రూపంలో ఉండటం సాధ్యం కాదు. బదులుగా ఐరన్ ఆక్సీహైడ్రాక్సైడ్లు లాంటి ఖనిజాల నిర్మాణంలో నీటి భాగాలు నిల్వ ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిల్వల పరిమాణం చాలా పెద్దదిగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. భూమ్మీద అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్ లో ఉన్న నీటితో పోలిస్తే.. భూమి లోపల బంధించబడి ఉన్న నీటి పరిమాణం రెండింతలు ఉండొచ్చన్న అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ నీరు ఇటీవల భూమి లోపలికి చేరింది కాదని పరిశోధకులు భావిస్తున్నారు. భూమి ఏర్పడిన తొలినాళ్ల నుంచే కొంత నీరు అంతర్భాగంలో నిల్వ ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఉపరితలంపై జరిగే నీటి చక్రం, భూఫలకాల కదలికలు కూడా నీటిని క్రమంగా భూమి లోతుల్లోకి తీసుకెళ్లి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రపు నీరు, వర్షపు నీరు భూమి పగుళ్లు, రాళ్ల పొరల ద్వారా లోపలికి వెళ్లి.. టెక్టోనిక్ ప్లేట్ల కదలికలతో మరింత లోతుకు చేరే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
భూమి లోపల నీరు ఉందనే విషయం కేవలం ఆసక్తికరమైన సమాచారం మాత్రమే కాదు. ఈ నీరు భూమి అంతర్గత వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు చాలా కీలకం. మాంటిల్ లోని నీటి ఉనికి అక్కడి ఖనిజాల లక్షణాలను, రాళ్ల కదలికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాటి ద్వారా భూకంపాలు ఎలా ఏర్పడుతున్నాయి? అగ్నిపర్వతాల కార్యకలాపాల్లో భూమి లోపలి నీటి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలను మరింత లోతుగా అధ్యయనం కొనసాగే అవకాశ ఉంది.
ఇప్పటివరకు భూమిపై నీటి గురించి మాట్లాడేటప్పుడు సముద్రాలు, నదులు, సరస్సులు, మంచు ప్రాంతాల గురించే ఎక్కువగా చర్చ జరిగేది. అయితే, ఈ పరిశోధన భూమి అంతర్భాగం కూడా నీటి నిల్వలకు భారీ కేంద్రంగా ఉండొచ్చనే అంచనాలను ముందుకు తెచ్చింది. భూమి లోపల దాగి ఉన్న ఈ నీటి అసలు పరిమాణం, దాని మూలం, భూమి పరిణామంలో దాని పాత్రపై మరిన్ని పరిశోధనలు జరిగితే.. భూగ్రహం ఎలా ఏర్పడింది? కాలక్రమంలో ఎలా మారింది? అనే ప్రశ్నలకు మరింత స్పష్టమైన సమాధానాలు దొరికే అవకాశం ఉంది.