How to start vlogging: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలని, మన జీవితంలోని విశేషాలను అందరితో పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందు కోసం వ్లాగింగ్ రంగంలోకి అడుగు పెట్టే.. వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే.. మీరు మొదటి సారి వ్లాగ్ ప్రారంభించబోతున్నట్లయితే.. కేవలం కెమెరా పట్టుకుని షూట్ చేస్తే సరి పోదు. మీ మొదటి వీడియోను అద్భుతంగా తయారు చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు, ట్రెండింగ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.
మీరు దేని గురించి వ్లాగ్ చేయాలనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ట్రావెలింగ్, ఫుడ్, టెక్నాలజీ, లేదా మీ రోజువారీ లైఫ్ స్టైల్.. ఇలా ఏదో ఒక స్పష్టమైన టాపిక్‌ను ఎంచుకోండి. మొదట్లోనే అన్ని రకాల కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. మీ ఆసక్తికి తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన కేటగిరీని ఎంచుకోవడం ద్వారా మీ మొదటి వీడియోకు మంచి అటెన్షన్ లభిస్తుంది.
మొదటి వ్లాగ్ కోసం వేల రూపాయలు పెట్టి డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలు, మైకులు కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న మంచి స్మార్ట్ ఫోన్ కెమెరాతోనే షూట్ ప్రారంభించొచ్చు. అయితే.. ఆడియో క్వాలిటీ మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే.. వీడియో బాగోకపోయినా పర్వాలేదు కానీ.. వాయిస్ సరిగ్గా వినపడక పోతే ప్రేక్షకులు వెంటనే వీడియోను స్కిప్ చేసేస్తారు. అందుకే ఒక సాధారణ కాలర్ మైక్ వాడటం మంచిది.
యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వ్లాగ్స్‌లో మొదటి 5 నుంచి 10 సెకండ్లు చాలా కీలకం. ప్రేక్షకులు మీ వీడియోను చూస్తారా లేదా ..అనేది మొదట్లో మీరు చూపించే విజువల్స్ లేదా మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. అందుకే మొదటి వీడియో షూట్ చేసేటప్పుడు ఇంట్రో చాలా క్యాచీగా, ఉత్సాహంగా ఉండేలా చూసుకోండి.
షూట్ చేసినంత మాత్రాన వ్లాగ్.. పూర్తి కాదు. ఎడిటింగ్ అనేది వీడియోకు ప్రాణం పోస్తుంది. అనవసరమైన సాగ దీసే సీన్లను కట్ చేసి, ఫాస్ట్ కట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , చిన్న పాటి టెక్స్ట్ యానిమేషన్లతో.. వీడియోను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎడిట్ చేయాలి. మీరు చెప్పే విధానం ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉండాలి.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!
మీ వీడియో ఎంత బాగున్నప్పటికీ.. దాని థంబ్‌నెయిల్ అట్రాక్టివ్‌గా లేకపోతే.. ఎవరూ క్లిక్ చేయరు. బ్రౌజింగ్ ఫీచర్‌లో మీ వీడియో కనిపించిన వెంటనే.. క్లిక్ చేసేలా బ్రైట్ కలర్స్, క్లియర్ టెక్స్ట్‌తో.. కూడిన థంబ్ నెయిల్ డిజైన్ చేయండి. అలాగే టైటిల్ కూడా చాలా సింపుల్‌గా, ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాలి.
మొత్తంగా చెప్పాలంటే.. మొదటి వీడియో పర్ఫెక్ట్‌గా రావాలని ఎక్కువ టెన్షన్ పడకండి. చిన్న చిన్న తప్పులు సహజమే..వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే అసలైన సక్సెస్.