M1 Rail Coach: మీరు రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు రైలు బోగీలపై ‘M1’ అని రాసి ఉండడాన్ని ఎప్పుడైనా గమనించారా? దాని అర్థం ఏమిటి, M1 అని కోచ్‌పై దానిని ఎందుకు రాస్తారు? మీరు హైదరాబాద్ నుంచి దిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలకు ప్రయాణిస్తున్నప్పుడు M1 కోచ్ లను చూస్తుంటారు. 2021లో భారతీయ రైల్వే M1, M2, M3 AC 3 టైర్ ఎకానమీ కోచ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని 3E అని కూడా పిలుస్తారు. ఈ సింబల్స్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికులు తమ కోచ్‌ను ఈజీగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. సులభంగా చెప్పాలంటే, మీ టికెట్‌పై 3E అని ఉంటే M సిరీస్ కోచ్‌ల కోసం చూడాలని అర్థం.
గతంలో AC 3-టైర్ కోచ్‌లను B1, B2 అని, స్లీపర్ కోచ్‌లను S1 అని పిలిచేవారు. రైల్వే శాఖ M సిరీస్ కోచ్‌లను తీసుకొచ్చి ఏసీ బోగీలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఎక్కువగా ఆధునిక LHB కోచ్‌లలో ఉపయోగిస్తారు. జర్మన్ టెక్నాలజీతో పనిచేసే లైట్ వెయిట్ స్టెయిన్‌లెస్ స్టీల్ కోచ్‌లు. ఇవి రైలు వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
M1, 3AC రెండూ ఏసీ కోచ్ లు అయినప్పటికీ, M1 అనేది ఎకానమీ వెర్షన్. వాటి మధ్య అతిపెద్ద తేడా టికెట్ రేట్లలో ఉంటుంది. సాధారణంగా 3AC కోచ్ లో సుమారు 72 బెర్త్‌లు ఉంటాయి. M1 కోచ్ లో దాదాపు 83 బెర్త్ లు ఉంటాయి. M1 లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కానీ లెగ్‌రూమ్ కాస్త తక్కువగా ఉంటుంది. ఇందువల్ల టికెట్ రేట్లు 6-8% తక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఎకానమీ వెర్షన్. సౌకర్యం పరంగా చూస్తే, 3AC కోచ్‌లలో కాస్త ఎక్కువ స్థలం, ప్రైవసీ కర్టెన్లు వంటి సదుపాయాలు ఉంటాయి. M1 కోచ్‌లో మిడిల్ బెర్త్‌లలో ఇరుకుగా ఉంటుంది. వీటిలో ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, ఫ్యాన్లు, ఏసీ సౌకర్యాలు ఉంటాయి.
Also Read: ఊటీ-మెట్టుపాళయం సమ్మర్ స్పెషల్ షురూ, నీలగిరి అందాలు చూసేయండి!
ఏసీ ప్రయాణాన్ని తగినంత మంది ఎక్కువ ప్రయాణికులకు అందించేందుకు M1 కోచ్‌లను రూపొందించారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాల మధ్య ప్రయాణించే వారికి ఈ కోచ్ లు సౌలభ్యంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రయాణానికి రూ. 300 నుంచి రూ. 500 వరకు సేవ్ చేసుకోవచ్చు. సీటింగ్ సంఖ్య పెరగడం వల్ల రద్దీ సమయాల్లో టికెట్ల దొరికే అవకాశం ఉంది. సమ్మర్ సీజన్, లాంగ్ జర్నీలలో M1 కోచ్ లను సెలెక్ట్ చేసుకోవడంతో కుటుంబ ప్రయాణాల్లో రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో కోచ్ టైప్ M1 అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏసీ కోచ్ ల తరహాలోనే బుకింగ్ అనంతరం M1 కోచ్ లను మార్చుకోవడం కుదరదు. రీఫండ్ రూల్స్ 3AC కోచ్ ల మాదిరిగానే ఉంటాయి.