Udaya Bhanu Career: ఇప్పుడంటే ఏ ఈవెంట్ చూసినా యాంకర్ గా సుమనే దర్శనమిస్తుంది.కానీ ఒకప్పుడు ఈ రేంజ్ లో బుల్లితెరని ఏలింది ఎవరైనా ఉన్నారంటే ఉదయభాను పేరునే చెప్పుకోవాలి. అలా ఒకటి రెండు కాదు.అప్పట్లో వచ్చిన హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, రేలా రే రేలా, ఢీ ..ఇలా ఏ షో వచ్చినా ఉదయభానే దర్శనమిచ్చేది.
ముఖ్యంగా స్టేజ్ పైకి ఎక్కిందంటే తనదైన ఎనర్జీతో ,మాటల ప్రవాహంతో షో మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించేది.అలాంటి ఉదయభాను ఉన్నపళంగా బుల్లి తెరపై యాంకరింగ్ చేయడం తగ్గిపోయింది.ఇక తాజాగా పంచనామా వెబ్ సిరీస్ తో ప్రొడ్యూసర్ గ ఎంట్రీ ఇచ్చింది.మరింతకీ ఉదయభాను కెరీర్ అలా మొదలైందో..ఎలా యాంకరింగ్ నుండి కనుమరుగు అయిపోయిందో ఒకసారి చూసేద్దాం.
చిన్నప్పటి నుండే కళలు అంటే ఇష్టం
ఉదయభాను స్వస్థలం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్. తనకి చిన్నప్పటి నుండే కళలు అంటే ఇష్టం ఉండటంతో తన తల్లి తనకి క్లాసికల్ డాన్స్,కూచిపూడి కూడా నేర్పించారు.అలా చిన్నప్పటినుండే ఒకవైపు చదువుకుంటూనే స్టేజ్ షోలు చేస్తూ చాలా హుషారుగా ఉండేది.
అయితే చాల మంది అనుకుంటున్నట్టుగా ఉదయభాను మొదటగా బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇవ్వలేదు.ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్రసైన్యం సినిమాలో తొలిసారిగా మేకప్ వేసుకున్న ఉదయభాను ఆ సినిమాలో ఆర్ నారాయణ మూర్తికి చెల్లిగా నటించి మెప్పించింది.
చేసిన మొదటి షోనే సూపర్ డూపర్ హిట్
అయితే ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే బుల్లితెరపై ‘హృదయాంజలి’ అనే ప్రోగ్రాం కి యాంకర్ గా చేసే అవకాశం దక్కించుకుంది.ఇక చేసిన మొదటి షోనే సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘జాణవులే నెరజాణవులే’, ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’, ‘రేలా రే రేలా’, ‘ఢీ’..ఇలా డ్యాన్స్ షోలు, గేమ్ షోలు, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి ఎన్నో షోలకి యాంకరింగ్ చేస్తూ అప్పట్లో నెంబర్ వన్ యాంకర్ గా టాలీవుడ్ లో పాతుకుపోయింది.
స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు
అయితే అలా యాంకర్ గా రానిస్తూనే మరో వైపు ‘వేటగాడు’, ‘కొండవీటి సింహాసనం’, ‘పోలీస్ నంబర్ 1’, ‘బస్తీ మే సవాల్’, ‘శ్రావణమాసం’ వంటి సినిమాల్లో కనిపించి నటిగా ప్రూవ్ చేసుకుంది.అలాగే ‘లీడర్’, ‘జులాయి’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది కూడా.
అయితే ముఖ్యంగా నటి పరంగా చెప్పుకోవాల్సివస్తే 2013లో వచ్చిన ‘మధుమతి’సినిమాని స్పెషల్ గా చెప్పుకోవాలి.అయితే ఎంత ఎఫర్ట్ పెట్టి నప్పటికీ సినిమా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ సినిమాలలో లీడ్ రోల్స్ చేసే సాహాసం చేయలేకపోయింది.
అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రతినిధి2 తో పాటు త్రిభాణదారి భార్బరిక్ సినిమాలో తళుక్కుమంది. అయితే బుల్లితెరతో పోలిస్తే సినిమాలకి డేట్స్ ఎక్కువగా ఇవ్వాల్సి రావడం,అలాగే యాంకరింగ్ చేసేటపుడు వచ్చినంత రెమ్యూనరేషన్ సినిమాలు చేస్తున్నప్పుడు రావట్లేదని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
కుటుంబ బాధ్యతలు వంటివి వాటి వల్లే
అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఉదయభాను బుల్లితెరపై ఉన్నపళంగా మాయం అవడంతో ఇంత క్రేజ్ ఉన్న యాంకర్ ఎందుకు దూరమయ్యారు?అన్న ప్రశ్న కి సమాధానంగా జీవితంలో పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు వంటివి వాటి వల్లే యాంకరింగ్ కి దూరం అయ్యనని గతంలో చెప్పుకొచ్చింది ఉదయభాను.
మిగిలిపోయిన ఓ చేదు జ్ఞాపకం
అయితే ఎంతో హుషారుగా సాగుతున్న ‘ఢీ’ షో నుంచి తప్పుకోవడం కూడా తన కెరీర్‌లో మిగిలిపోయిన ఓ చేదు జ్ఞాపకం అనే చెప్పాలి.తాను ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినా, తనను ఎందుకు షో నుంచి తీసేశారనే విషయం ఇప్పటివరకు చెప్పలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది . తనకి అవకాశాలు తగ్గడానికి యాంకరింగ్ రంగంలో ఉన్న కొన్ని గ్రూపులు, సిండికేట్ వంటి వాటి వల్లే అని గతంలో తెలిపింది కూడా.
నిర్మాతగా ఎలా మెప్పిస్తుందో
ఇక ప్రస్తుతం నటిగా, యాంకర్ గా కాకుండా ఉదయభాను మళ్లీ తన కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.‘ఉదయభాను ప్రొడక్షన్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ పెట్టి ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించి తన లక్ ని టెస్ట్ చేసుకుంటుంది.చూడాలి మరి యాంకర్ గా అలరించిన ఉదయభాను నిర్మాతగా ఎలా మెప్పిస్తుందో చూడాలి !