Old Woman Incident: సాధారణంగా 80 ఏళ్లు దాటిన వారు నడవడానికే ఇబ్బంది పడతారు. కానీ, చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన ఒక వృద్ధురాలు మాత్రం ఏకంగా 27వ అంతస్తు నుండి భవనం బయటి గోడల వెంట కిందికి దిగి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన చూస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపిస్తుంది. అయితే, ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన సాహసం కాదు, ప్రాణ భయం నుండి పుట్టిన ఒక సాహసోపేతమైన పోరాటం.
ఒక్క పొరపాటు.. ఊహించని మలుపు
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ 89 ఏళ్ల వృద్ధురాలు 27వ అంతస్తులోని తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఆ రోజు దురదృష్టవశాత్తు పడకగది తలుపులు అనుకోకుండా లాక్ అయిపోయాయి. తనను తాను రక్షించుకోవడానికి ఫోన్ చేద్దామంటే, మొబైల్ ఫోన్ బయటి హాలులో ఉండిపోయింది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. సహాయం కోసం కేకలు వేసినా ఎవరికి వినబడలేదు. దాంతో ఆ గదిలోని కిటికీ ద్వారా బయటకు వెళ్లి, మొదటి అంతస్తు వరకు చేరుకోవాలనే ఒక ప్రమాదకరమైన నిర్ణయాన్ని ఆమె తీసుకుంది.
గాల్లో వేలాడుతూ మృత్యువుతో పోరాటం..
ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా, కేవలం మనోధైర్యంతో ఆమె కిటికీ దాటి బయటకు వచ్చింది. ఎయిర్ కండిషనర్ (AC) అవుట్‌డోర్ యూనిట్ల కోసం అమర్చిన ఇనుప రెయిలింగ్‌లను పట్టుకుని ఒక్కో అంతస్తు కిందికి దిగడం మొదలుపెట్టింది. ఆ సమయంలో భవనం కింద ఉన్న ఒక క్లీనర్, సెక్యూరిటీ గార్డుకు పైన ఏదో శబ్దం వినిపించింది. వారు తల పైకెత్తి చూడగా, అత్యంత ఎత్తులో ఒక మహిళ గాలిలో వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిస్తూ, ఆమెను కదలకుండా అక్కడే ఉండమని గట్టిగా కేకలు వేశారు.
అలసటలోనూ ఆగని అడుగులు
పోలీసులు, రెస్క్యూ టీమ్ వస్తున్నప్పటికీ ఆమె ఆగలేదు. సుమారు ఆరు అంతస్తుల మేర అత్యంత చాకచక్యంగా కిందకు దిగింది. అయితే, వయస్సు సహకరించకపోవడంతో 21వ అంతస్తు వద్దకు చేరుకునే సరికి ఆమె పూర్తిగా నీరసించిపోయింది. ఆరు అడుగుల వెడల్పు కూడా లేని ఏసీ ప్లాట్‌ఫాంపై అతుక్కుపోయి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కూర్చుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి ఆమె తీవ్రమైన అలసటతో ఉండటాన్ని గమనించారు.
అగ్నిమాపక సిబ్బంది అద్భుత రక్షణ చర్య
అంత ఎత్తులో గాలి వేగం ఎక్కువగా ఉండటంతో ఆ వృద్ధురాలిని రక్షించడం సవాలుగా మారింది. అగ్నిమాపక సిబ్బంది ఆమెకు సేఫ్టీ బెల్టులు అమర్చి, ముందుగా ఆమెకు నీరు, వెచ్చదనం కోసం ఒక జాకెట్ అందించారు. ఇరుకైన రెయిలింగ్లను కట్ చేసి, ప్లాట్‌ఫాం నుండి 21వ అంతస్తు కిటికీ వరకు ఒక స్ట్రెచర్‌ను వంతెనలా అమర్చారు. సుమారు 20 నిమిషాల పాటు ఆమెకు ధైర్యం చెబుతూ, అత్యంత సురక్షితంగా భవనం లోపలికి తీసుకువచ్చారు.
క్షేమంగా బయటపడ్డ బామ్మ.. కృతజ్ఞతతో కుటుంబం
ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు, కానీ ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల తీవ్రమైన భయం, నీరసంతో కనిపించింది. ఆమె సాహసాన్ని చూసి రెస్క్యూ టీమ్ కూడా ముక్కున వేలేసుకుంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తమ బామ్మను ప్రాణాలతో చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి వారు చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: తాళి కట్టే వేళ.. మండపం నుంచి పెళ్లికొడుకు జంప్.. అసలేం జరిగిందంటే?