Telugu Comedy Drama OTT : ఓ చిన్న టూత్ బ్రష్… తండ్రి కొడుకుల మధ్య ఇంత పెద్ద గొడవకు కారణమవుతుందా ? పంటి నొప్పితో బాధపడుతున్న వృద్ధ తండ్రి, డాక్టర్ చెప్పిన పళ్ల బురుసు కొనివ్వమని కొడుకును అడుగుతాడు. కానీ తన సమస్యల్లో బిజీగా ఉన్న కొడుకు ఆ చిన్న కోరికను కూడా పట్టించుకోడు. దాంతో అవమానం, ఒంటరితనం, కోపంతో ఆ తండ్రి ఏకంగా కొడుకుపై పోలీస్ కేసు పెట్టి, చివరకు కోర్టు మెట్లు ఎక్కితే ? నవ్వు తెప్పించే ఈ విచిత్రమైన గొడవ వెనుక వృద్ధాప్యం, కుటుంబ నిర్లక్ష్యం, తండ్రీకొడుకుల మధ్య పెరిగిన దూరం వంటి ఎమోషనల్ అంశాలు కూడా దాగి ఉంటాయి. తెలంగాణ పల్లె నేటివిటీని సహజంగా చూపించే తెలుగు కామెడీ డ్రామా ‘Pallaburusu’ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి కేవలం బ్రష్ కోసమే తండ్రి కోర్టుకు వెళ్లాడా ? అసలు కొడుకుపై అంత కోపం ఎందుకు వచ్చింది ? చివరికి ఈ కుటుంబ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
తెలంగాణ పల్లెలో శంభు అనే వృద్ధుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. వయసు మీద పడటంతో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్ అతనికి టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తాడు. దీంతో తన కొడుకు తిరుపతిని పళ్ల బురుసు, మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. కానీ తిరుపతి తన కుటుంబ సమస్యలు, కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతో తండ్రి మాటను పట్టించుకోడు.
మొదట చిన్న విషయంలా కనిపించిన ఈ నిర్లక్ష్యం క్రమంగా తండ్రీకొడుకుల మధ్య ఉన్న పాత అసంతృప్తిని బయటకు తీస్తుంది. తనను కొడుకు పట్టించుకోవడం లేదనే బాధ శంభును లోపల నుంచి కుంగదీస్తుంది. ఇదే సమయంలో కొడుకు కుటుంబంలో జరిగే ముఖ్యమైన వేడుకకు కూడా తండ్రిని సరిగ్గా భాగస్వామిని చేయకపోవడంతో అతని బాధ మరింత పెరుగుతుంది. చివరకు పళ్ల బురుసు కొనివ్వలేదనే విషయాన్ని కారణంగా చూపిస్తూ శంభు పోలీసులను ఆశ్రయిస్తాడు. అక్కడితో ఆగకుండా న్యాయం కోసం కోర్టు వరకు వెళ్తాడు.
ఇక ఈ వింత కేసు ఊరంతా చర్చగా మారుతుంది. పోలీసులకు, కోర్టుకు చేరిన ఈ కుటుంబ గొడవలో అసలు సమస్య బ్రష్ కాదని క్రమంగా అర్థమవుతుంది. తండ్రి కోరుకున్నది ఖరీదైన వస్తువు కాదు, తన కొడుకు నుంచి కాస్త ప్రేమ, శ్రద్ధ. అయితే తండ్రీకొడుకుల మధ్య దూరం ఎక్కడ మొదలైంది ? శంభు తన సమాధిని తానే ఎందుకు సిద్ధం చేసుకున్నాడు ? చివరికి కుటుంబ సభ్యులు తమ తప్పును గుర్తిస్తారా ? అనేదే సినిమాలోని అసలు ఎమోషన్.
Also Read : చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్
ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ‘పళ్లబురుసు’లో సుధాకర్ రెడ్డి శంభుగా, మురళీధర్ గౌడ్ తిరుపతిగా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి, సుజాత దీక్షిత్ తదితరులు నటించారు. సినిమా 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. కేవలం 20 రోజుల్లోనే సెప్టెంబర్ 2 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అంతేకాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 25 నిమిషాలు. ప్రస్తుతం IMDbలో 7.4 రేటింగ్ ఉంది. గ్రామీణ నేపథ్యం, సహజమైన కామెడీ, తండ్రీకొడుకుల ఎమోషన్, కుటుంబ విలువలతో సాగే సినిమాలు ఇష్టపడే వారు ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు.