Cosmetic surgeries Death | ఈ కాలంలో అందం కోసం పాకులాడని వారుండరు. మార్కెట్‌లో ఆరోగ్యం కంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కే డిమాండ్ ఎక్కువ. అందంగా కనిపించేందుకు ఈ రోజుల్లో అందరూ నానా కష్టాలు పడుతున్నారు. బ్యూటీ క్రీములతో పాటు, జిమ్ లు, యోగాలు చేస్తున్నారు. అదీ చాలదన్నట్లు అవసరం లేకున్నా కాస్మోటిక్ ఆపరేషన్లు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. అలా అందంగా కనిపించేందుకు ఒక యువతి కాస్మోటిక్ ఆపరేషన్లు చేయించుకొని చనిపోయింది.
వివరాల్లోకి వెళితే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. చైనా దేశంలోని గువాంగ్ జీ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం అయిన గుయిగాంగ్‌లో నివసించే లియు అనే యువతి అందమైన కనుబొమ్ములు, సూటిగా ఉండే ముక్కు కోసం కాస్మోటిక్ ఆపరేషన్ చేయించుకోవాలని భావించింది. అలా 2020లో లియు దక్షిణ చైనాలోని నాన్నింగ్ నగరానికి వెళ్లి అక్కడ ఒక కాస్మోటిక్ హాస్పిటల్ లో డాక్టర్లను సంప్రదించింది. ఆమె తనకు అందమైన కళ్లు, సూటిగా ఉండే ముక్కు కోసం ఆపరేషన్ల గురించి అడిగింది. డాక్టర్లు లియుని పరీక్షించి.. ఆమె వక్షోజాలు కూడా పెద్దవిగా ఉండేందుకు చిన్న ఆపరేషన్ చేసుకోవాలని సూచించారు. ఆమె మూడు శరీర భాగాలు అందంగా తీర్చిదిద్దేందుకు ఆరు ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకోసం 5600 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షలు) ఖర్చు అవుతుందని తెలిపారు.
Also Read : దీపావళి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త.. అతని ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య!
లియు తన కాస్మోటిక్ అపరేషన్ల కోసం బ్యాంకు నుంచి రూ.5 లక్షల లోన్ తీసుకుంది. ఆ తరువాత డిసెంబర్ 9 2020న సాయంత్రం ఆమెకు 5 గంటల పాటు రెండు కనుబొమ్మలకు ఐ లిడ్ సర్జరీ, ముక్కుకు నోస్ జాబ్ సర్జరీ చేశారు. ఈ ఆపరేషన్లు జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే ఆమెకు తొడ భాగంలో లైపోసక్షన్ సర్జరీ చేసి అక్కడి నుంచి కొవ్వుని వెలికి తీసి.. ఆ కొవ్వుని ఆమె వక్షోజాల భాగంలో నింపారు.
ఆ తరువాత ఒక్కరోజు లియు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంది. డిసెంబర్ 11న లియుని డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే లియు ఆస్పత్రి నుంచి బయలుదేరడానికి లిఫ్ట్ లోకి వెళ్లింది. అయితే లిఫ్ట్ లో వెళ్లిన క్షణాల్లోనే లియు కుప్పకూలిపోయింది. లియు లిఫ్ట్ లో అపస్మారక పడిఉండడం చూసి ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ఆ తరవాత కూడా ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో లియుని సెకండ్ నాన్నింగ్ పీపుల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. లియు మృతదేహానికి పోస్ట్ మార్టం చేయగా.. ఆమె తొడ భాగానికి చేసిన ఆపరేషన్ వల్ల ఆమె అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ (ఊపిరి తిత్తుల సమస్య వల్ల శ్వాస ఆగిపోవడం) జరిగిందని తేలింది.
కాస్మోటిక్ ఆపరేషన్లు చేయడంలో వైద్యులు చేసిన తప్పిదం కారణంగానే లియు చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు కోర్టులో కేసు వేశారు. నాలుగు సంవత్సరాలుగా జియాంగ్నాన్ జిల్లా కోర్టులో ఆ కేసు విచారణ కొనసాగింది. లియు కుటుంబ సభ్యులు తమకు నష్టపరిహారంగా 168000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.కోటి 42 లక్షలు) చెల్లించాలని అడిగారు. కానీ డాక్టర్లు ఇలాంటి ఆపరేషన్లలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముందే లియుకి హెచ్చిరించామని వాదించారు. కేసు వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి చివరికి రూ.59 లక్షలు చెల్లించాలని కాస్మోటిక్ సర్జన్లు ఆదేశించారు.