హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అభిమానులు హంగామా సృష్టించారు. హిందూపురంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. బాలయ్య కాన్వాయ్ కి అడ్డుపడి తమ ఆసక్తిని ఆయనకు తెలిపారు. ఆయన మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య ఫ్యాన్స్ హంగామా అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే బాలకృష్ణ మాత్రం స్పందించకపోవడం విశేషం. అయితే బాలయ్యకు మంత్రి పదవి రావడం అంత ఈజీనా, ఒకవేళ మంత్రి పదవి గ్యారెంటీ అనుకుంటే అది సాధ్యమయ్యేది ఎప్పుడనేది మాత్రం ప్రశ్నార్థకం.
నెంబర్ -3
నారా, నందమూరి ఫ్యామిలీలు రెండూ ఒకటిగానే ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరికి ప్రస్తుతం పదవులున్నాయి. ఈ కుటుంబం నుంచే మరొకరికి పదవి అంటే ఆలోచించాలి. అయితే బాలయ్య సీనియార్టీని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన ఆయనకు పదవి కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. బాలయ్య మంత్రి పదవి కోసం ఎవరైనా తమ పదవి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని వారు అంటున్నారు.
బాలయ్య మంత్రి అయితే..
ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి బాలకృష్ణ తన సినిమాలపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం సినిమాలకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారనే చెప్పాలి. ఇక బాలయ్య కూడా మంత్రి అయితే ఆయనకి కూడా సినిమాలతో గ్యాప్ మరింత పెరుగుతుంది.
Also Read: సీఆర్డీఏ భవన ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఒత్తిడి చేస్తే ఫలితం ఉంటుందా?
బాలకృష్ణకు మంత్రి పదవి విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు, చంద్రబాబు కూడా ఎప్పుడూ అలాంటి విషయాలపై స్పందించలేదు. బాలా మామయ్య మంత్రి పదవిపై ఇటు లోకేష్ కూడా ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాత్రం అభిమానులు ఒత్తిడి తేగలరా అనేది ప్రశ్నార్థకం. బాలకృష్ణ కూడా తనకు మంత్రి పదవి కావాలని ఎప్పుడూ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అలాగని మంత్రి పదవి తనకు వద్దు అని కూడా ఆయన చెప్పలేదు. మంత్రి బాలయ్య అని పిలుచుకోడానికి ఆయన అభిమానులు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు
టైమ్ వస్తుందా?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబం విషయంలో కూడా ఇదే జరిగింది. నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రభుత్వంలో పదవి కోసం కొన్నాళ్లు వేచి చూశారు. టీటీడీ చైర్మన్ పదవితో మొదలు పెడితే కార్పొరేషన్ పదవులు కూడా ఇస్తారని అన్నారు. కానీ ఎట్టకేలకు తన అన్నయ్యని చట్టసభకే పంపించాలని పవన్ కల్యాణ్ ఫిక్స్ కావడంతో ఇటీవలే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. మరి బాలయ్య విషయంలో కూడా ఇలాంటి మేజిక్ జరుగుతుందో లేదో వేచి చూడాలి. టైమ్ వస్తే బాలయ్య బాబు మంత్రి కావడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవనే చెప్పాలి.