కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లాలో ఉన్న లక్కుండి అనే గ్రామంలో ఒక ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక కుటుంబం కొత్త ఇల్లు నిర్మించడానికి పునాది తవ్వుతుండగా మట్టిలో ఒక పాత్ర బయటపడింది. దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించింది. కొద్దిసేపటికే పెద్ద నిధి దొరికిందనే వార్త వైరల్ గా మారింది. చాలా మంది ఆసక్తితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పురావస్తు శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఆభరణాలను పరిశీలించారు. మొదట కనిపించినంత పెద్ద నిధి కాదని తేల్చారు.
పురావస్తు శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, పూర్వకాలంలో ప్రజలు తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులను భద్రంగా ఉంచేందుకు భూమిలో పాతిపెట్టే పద్ధతి ఉండేది. దొంగతనం భయం లేదా యుద్ధాల భయం ఉన్నప్పుడు కుటుంబాలు ఇలా చేసేవారని వివరించేవారు. లక్కుండిలో బయటపడిన బంగారం కూడా అలాంటి ఒక కుటుంబానికి చెందినదై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే దీనిని రాజుల నిధి లేదా భారీ చారిత్రక ఖజానాగా పరిగణించలేమని వారు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆభరణాల ఆకృతి, తయారీ విధానం చూసి అవి చాలా పాతవని అంచనా వేస్తున్నారు.
Also read: Priyanka Chopra: తండ్రిగా మారిన తర్వాత జీవితం మారిపోయింది… ప్రియాంక చోప్రా భర్త భావోద్వేగం
అవి చాళుక్యుల నాటి నగలు
నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఆభరణాలు దాదాపు 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినవిగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ కాలంలో లక్కుండి ప్రాంతం చాళుక్యుల పాలనలో ప్రముఖ కేంద్రంగా ఉండేది. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు, శాసనాలు, చారిత్రక కట్టడాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉన్నందున భూమి తవ్వకాలలో ఇలాంటి వస్తువులు బయటపడటం కొత్తేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. కనుగొన్న బంగారం బరువు సుమారు అర కిలో వరకు ఉండవచ్చని సమాచారం. అయితే అవి రాజ కుటుంబానికి చెందిన విలాసవంతమైన ఆభరణాల్లా కాకుండా సాధారణంగా వాడే నగల మాదిరిగా ఉన్నాయని అధికారులు చెప్పారు.
ఆ నగలు మావే
ఈ బంగారం బయటపడిన తర్వాత మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ భూమి యజమానులు ఇవి తమ పూర్వీకుల ఆభరణాలు కావచ్చని భావిస్తూ ప్రభుత్వాన్ని సంప్రదించారు. తగిన నష్టపరిహారం ఇవ్వాలని లేదా ఆ ఆభరణాలను తిరిగి ఇవ్వాలని వారు కోరినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ నగలు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నాయి. వాటి చరిత్రపై మరింత పరిశోధన కొనసాగుతోంది. ఈ సంఘటన పెద్ద నిధి కాకపోయినా, పూర్వకాలంలో ప్రజలు తమ సంపదను ఎలా కాపాడుకునేవారో తెలియజేసే ఉదాహరణగా నిలిచింది.
Also read: Coriander Pongali: కొత్తిమీర పొంగలి ఎప్పుడైనా తిన్నారా? రుచి అదిరిపోద్ది.. ఇదిగో రెసిపీ