కట్టె పొంగలి గుర్తొస్తేనే నోరూరిపోతుంది. నెయ్యి వాసనతో ఉండే ఈ పొంగలిని పండగలప్పుడు ఎక్కువగా చేస్తారు. కానీ ఇప్పుడు తమిళనాడులో ఒక కొత్త రకం పొంగల్ బాగా ట్రెండ్ అవుతోంది. అదే గ్రీన్ పొంగల్.ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరికీ సరిపోయే రెసిపీ ఇది. ఈ పొంగలిలో బియ్యం, పెసరపప్పుతో పాటు కొత్తిమీర, పుదీనా లాంటి ఆకుకూరలు వాడుతారు. అందుకే దీనికి పచ్చటి రంగు వస్తుంది. నెయ్యి తక్కువగా వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలాగో తెలుసుకోండి.
కొత్తిమీర పొంగలి తయారికి కావలసిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
పెసరపప్పు – అర కప్పు
కొత్తిమీర – అర కప్పు
పుదీనా ఆకులు – పావు కప్పు
పచ్చి మిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
నెయ్యి – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూన్
మిరియాలు – ఒక స్పూన్
కరివేపాకు – కొద్దిగా
జీడిపప్పు – పది
ఉప్పు – తగినంత
నీరు – అవసరమైనంత
Also read: Green peas Pulao: ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్‌తో టేస్టీ పులావ్ రెసిపీ ఇదిగో
కొత్తిమీర పొంగలి రెసిపీ
1. ముందుగా బియ్యం, పెసరపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత పెసరపప్పును ఒక కళాయిలో తక్కువ మంటపై కొద్దిగా వేయించాలి. రంగు మారకూడదు, కేవలం వాసన రావాలి అంతే.
2. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చి మిర్చి, అల్లంను మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి పేస్ట్‌గా గ్రైండ్ చేయాలి.
3. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కడిగిన బియ్యం, వేయించిన పసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులో తయారు చేసిన ఆకుకూరల పేస్ట్ వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు, నీరు పోసి కలిపి మూత పెట్టాలి.
4. మీడియం మంటపై 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మంట తగ్గించి కొద్దిసేపు ఉంచాలి.
5. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తెరిచి చూడాలి. పొంగల్ మెత్తగా, క్రీమీగా ఉండాలి. గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీరు పోసి కలపవచ్చు.
6. ఇప్పుడు తాలింపు వేసేందుకు ఒక చిన్న కళాయి తీసుకుని నెయ్యి వేడి చేయాలి.
7. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
8. తర్వాత జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
9. ఈ తాలింపును నేరుగా ఉడికిన గ్రీన్ పొంగల్ మీద వేసి బాగా కలపాలి.
10. నెయ్యి వాసనతో పాటు ఆకుకూరల రుచి కలసి పొంగలి చాలా అద్భుతంగా తయారవుతుంది.
Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది
ఈ గ్రీన్ పొంగలి ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర, పుదీనా వల్ల ఐరన్, విటమిన్లు లభిస్తాయి. పెసరపప్పు వల్ల ప్రోటీన్ అందుతుంది. జీర్ణక్రియకు కూడా ఇది సహాయపడుతుంది. డైట్‌లో ఉన్నవాళ్లు కూడా తక్కువ నెయ్యితో ఈ పొంగలి తినవచ్చు.