Karnataka Accident Video: కర్ణాటకలో దారుణం జరిగింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఓ మహిళ అమాంతం గాల్లోకి ఎగిరింది. రోడ్డు పక్కనే ఉన్న తీగలకు కాళ్లు తగిలి తలగిందులాగా వేలాడింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను కిందికి దించారు. తీవ్రంగా గాయపడిన సదరు మహిళను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన అక్కడే ఉన్నసీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టార్గెట్ ఒకరు.. బలైంది మరొకరు!
కర్నాటకలోని మంగళూరులో ఈ దారుణ ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న పాపానికి ఆ మహిళ ప్రాణం మీదికి వచ్చింది. నిజానికి ఈ ఘటనలో అసలు కథ వేరే ఉంది. తన పక్కింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తితో సతీష్ అనే వ్యక్తికి చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. రకరకాల విషయాల్లో ఇద్దరి మధ్య పగలు కొనసాగుతున్నాయి. తాజాగా మురళీ బైక్ మీద వెళ్తుండగా సతీష్ అతడిని కారుతో గుద్ది హత్య చేయాలి అనుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే సతీష్ బైక్ మీద వెళ్తున్న సమయంలో సతీష్ వెనుక నుంచి కారులో ఫాలో అయ్యాడు. కారు వేగం పెంచి సతీష్ ను ఢీకొట్టాలనుకున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మహిళను సతీష్ చూసుకోలేదు. ఆమెను ఢీకొట్టడంతో పాటు మరళీ బైక్ కు డ్యాష్ ఇచ్చాడు. ఈ ఘటనలో అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
వేగంగా ఎగిరి.. తలకిందులుగా వేలాడి..
ఈ ఘటనలో సతీష్ సేఫ్ అయినప్పటికీ సదరు మహిళ మాత్రం తీవ్రంగా గాయపడింది. కారు వేగంగా వచ్చి తగలడంతో అమాంతం గాల్లోకి ఎగిరింది. గోడ మీదుగా ఉన్న వైర్లకు ఆమె కాలు చిక్కుకోవడంతో సుమారు అర నిమిషం పాటు తలకిందులుగా వేలాడింది. వెంటనే, ఆమెను గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఆమె దగ్గరికి పరిగెత్తారు. అందరూ కలిసి ఆమెను నెమ్మదిగా కిందికి దింపారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆమెకు మంచి నీళ్లు తాపి, ప్రథమ చికిత్స చేసి అక్కడి నుంచి ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈ నెల 13న జరిగింది.
#Mangalore #accident at #kapikad, Speeding Car Crashes into Cyclist, Woman Thrown Against Wall in Attempted #Murder Case pic.twitter.com/SozBtHgpaA
— Headline Karnataka (@hknewsonline) March 13, 2025
గతంలో మురళీ తండ్రిపై హత్యాయత్నం చేసిన సతీష్
స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన సతీష్ ను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మురళీ మీద హత్యయత్నం చేసిన సతీష్, గతంలో మురళీ తండ్రి మీద కూడా మర్డర్ అటెమ్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. “అదృష్టం అంటే ఆమెదే, కారు ఢీకొట్టిన విధానం చూస్తుంటే ఆమె స్పాట్ లోనే చనిపోయే పరిస్థితి కనిపిస్తోంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అటు ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారిని బయటకు రాకుండా జైల్లోనే ఊచలు లెక్కించేలా చేయాలని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
Read Also: హోలీ పేరుతో యువతి దుస్తులు చింపేసిన ఆకతాయిలు.. ఇదెక్కడి దారుణం?