Viral Video : అసలే కోతులు. గుంపులు గుంపులు. ఓ రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. కోతులు జగడం ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసుగా. అరుస్తూ, రక్కుతూ, కొరుకుతూ.. ఆగమాగం చేశాయి. వాటి మధ్య భీకర దాడి జరిగింది. ఓ గుంపులో ఒక కోతి పిల్ల కూడా ఉంది. అది బెదిరిపోయింది. భయంతో కరెంట్ పోల్ ఎక్కింది. షాక్ తగిలి కింద పడిపోయింది. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడింది.
ఆ పిల్ల కోతి పరిస్థితి పట్టించుకోకుండా మిగతా కోతులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పాపం ఆ కోతి పిల్ల అక్కడే నేలపై పడుంది. అది చూసిన స్థానిక యువకులు దగ్గరికి వెళ్లారు. కోతిని కాపాడే ప్రయత్నం చేశారు. మంచినీళ్లు తాగించాలని చూశారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. ఆ యువకులకు మంచి ఐడియా వచ్చింది. కోతికి సీపీఆర్ చేస్తే..?
వేరే చేసేదేం ఉంది. ఆ కోతిని ఎలా కాపాడాలో వాళ్లకు తెలీదు. కరెంట్ షాక్ తగిలింది కాబట్టి గుండె ఆగిపోయి ఉంటుందని గెస్ చేశారు. CPR చేస్తే బతకొచ్చని అనుకున్నారు. వెంటనే ఓ యువకుడు ఆ కోతి పిల్ల ఛాతిపై చేతులు వేసి ప్రెస్ చేస్తూ ఉన్నాడు. సీపీఆర్ వర్కవుట్ అయింది. కాసేపటికి ఆ చిట్టి కోతి కోలుకుంది. ఊపిరి తీసుకుంది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతి పిల్లకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన శ్రీకాంత్, కృష్ణలను స్థానికులు అభినందిస్తున్నారు. మనుషులు పడిపోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో.. కోతికి సీపీఆర్ చేసి బతికించడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.