Amazing Facts About Secretary Bird: ఆ బర్డ్ చూడ్డానికి అందంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఈకలు, కళ్ల నుంచి ముక్కు వరకు ఆరెంజ్ కలర్ లుక్, బలమైన శరీరంతో ఆకట్టుకుంటుంది. కానీ, ఈ పక్షికి అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా పాములను వేటాడే విధానం చూసినవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే.. ఆఫ్రికా గడ్డి భూముల్లో ఎక్కువగా కనిపించే సెక్రటరీ బర్డ్. పొడవాటి కాళ్లతో పాములను ఇట్టే చంపేస్తుంది. పాములను తనను చూసి పారిపోకుండా, వాటిని మిల్లీ సెకెన్ల వ్యవధిలోనే ప్రాణాలు తీసేస్తుంది.
ఈ పక్షి దాదాపు 1.3 మీటర్ల ఎత్తు ఉంటుంది. కొంగలా పొడవాటి కాళ్లు, డేగలా ముఖం కలిగి ఉండటంతో ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఎక్కువ సమయం నేల మీదే తిరుగుతూ వేటాడుతుంది. అవసరమైతే ఎగరగలిగినా, సాధారణంగా కాలినడకనే జీవిస్తుంది.
సెక్రటరీ బర్డ్ వేటాడే స్టైల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పామును చూసిన వెంటనే దాని తలపై వేగంగా, బలంగా తన్నుతుంది. ఈ కిక్ పవర్ ఫుల్ గా ఉండి, కేవలం కొన్ని మిల్లీ సెకన్లలోనే పాము వెన్నెముక విరిగేలా చేస్తుంది. పాము దాడి చేయకుండా ఉండేందుకు రెక్కలను విప్పి దృష్టి మరల్చుతుంది. కాళ్లపై ఉండే గట్టిపొర పాము కాటుకు రక్షణగా పని ఉంటుంది. పాములే కాకుండా ఈ పక్షి చిన్న క్షీరదాలు, కీటకాలు, బల్లులను కూడా తింటుంది.
ఈ పక్షులు మగ, ఆడ పక్షితో ఒకసారి జత కట్టిన తర్వాత జీవితాంతం కలిసి ఉంటాయి. సాధారణంగా ఆకాసియా చెట్లపై గూళ్లు కడతాయి. ఒక జంటకు దాదాపు 50 కిలోమీటర్ల వరకు పరిధి ఉంటుంది. ఈ పక్షి అడవిలో 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తుంది. కొన్ని 19 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఆడ పక్షి గుడ్లు పెట్టిన తర్వాత సుమారు 45 రోజులు వాటిని పొదిగి పిల్లలను చేస్తుంది. ఈ పక్షి గుడ్లు సాధారణంగా నీలం లేదంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
సెక్రటరీ బర్డ్ అనే పేరు ఎలా వచ్చిందో కచ్చితంగా తెలియదు. అయితే, పాతకాలంలో లాయర్ల దగ్గర పనిచేసే సెక్రటరీలు ధరించే దుస్తులను పోలి ఉండటంతో ఆ పేరు వచ్చిందని ఒక అభిప్రాయం ఉంది. మరోవైపు అరబిక్ భాషలో వేటాడే పక్షి అనే అర్థంతో కూడా దీనిని పిలుస్తారు.
ప్రస్తుతం ఈ పక్షుల నివాస ప్రాంతాలు తగ్గిపోవడం వల్ల వీటి సంఖ్య తగ్గుతోంది. అయినా, కూడా ప్రకృతిలో అత్యంత తెలివైన, ధైర్యమైన వేటాడే పక్షులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. పాములతో పోరాడే విధానం చూస్తే నిజంగానే దీనిని పాముల పాలిట యమ ధర్మరాజుగా చెప్పుకోవచ్చు.
Read Also: ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్.. అడుగు పెట్టారో ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే!