కన్నడ వచ్చిన వాళ్లే బెంగళూరుకు రావాలనే వాదన గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కర్ణాటక వాసులు ఈ వాదనకు మద్దతు పలుకుతుండగా, నార్త్ స్టేట్స్ నుంచి వచ్చిన వారి నుంచి తీవ్ర వ్యకతిరేకత వస్తున్నది. గత ఏడాది సెప్టెంబర్ లో ఓ యూట్యూబర్ మొదలు పెట్టిన ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కర్నాటకలో ఉండే వారు కచ్చితంగా కన్నడను నేర్చుకోవాల్సిందే అనే వాదనను ఆయన తెర మీదికి తెచ్చారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వచ్చిన వారందరూ కన్నడ నేర్చుకోవాలనేది ఆయన డిమాండ్. అప్పట్లో సోషల్ మీడియాను ఈ వివాదం ఊపేసింది.
సోషల్ మీడియాలో మరోసారి కన్నడ రచ్చ
తాజాగా బెంగళూరుకు చెందిన బబ్రువాహన (@Paarmatma) అనే వ్యక్తి మరోసారి ఈ వివాదాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. కన్నడ నేర్చుకోవడానికి ఇష్టపడని పొరుగు రాష్ట్రాల వారికి బెంగళూరులోకి ఎంట్రీ లేదని చెప్పుకొచ్చాడు. “కన్నడ నేర్చుకోవడానికి ఇష్టపడని నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్లకు బెంగళూరులోకి ఎంట్రీ లేదు. ఇక్కడ భాషను, సంస్కృతిని గౌరవించని వారికి బెంగళూరు అవసరం లేదు” అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Bengaluru is closed for north India and neighbouring states who doesn't want to learn Kannada
They don't need Bengaluru when they can't respect language and culture #Kannada #Bengaluru #Karnataka pic.twitter.com/YNmgQwJToH
— ಬಬ್ರುವಾಹನ (@Paarmatma) January 23, 2025
బబ్రువాహన పోస్టుపై తీవ్ర చర్చ
కన్నడ వచ్చిన వాళ్లే బెంగళూరుకి రావాలంటూ బబ్రువాహన చేసిన ఈ పోస్టు సోషల్ మీడియా తీవ్ర చర్చకు కారణం అయ్యింది. కొందరు ఆయన వాదనకు మద్దతు పలికితే, మరికొంత మంది తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త భాషను నేర్చుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఎదుటి వ్యక్తుల మీద బలవంతంగా రుద్దకూడదని కామెంట్స్ పెడుతున్నారు. “అరే.. వావ్, భారత్ లోని ఓ ప్రాంతం వ్యక్తి కన్నడ నేర్చుకోవడానికి ఇష్టపడని ఇతర ప్రాంతాల వాళ్లు బెంగళూరులోకి ఎంట్రీ లేదని ఎవరో ఇంగ్లీషులో పోస్టు పెట్టారు. ఈ పోస్టు చదివితే బ్రిటీష్ వాళ్లు నవ్వుకుంటారు” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. “దయ చేసి ఈ కన్నడిగుడి బాధను అందరూ పట్టించుకోండి. కోవిడ్ తర్వాత చాలా మంది ఇలా ప్రవర్తిస్తున్నారు. వారిని అలా వదిలేసి బెంగళూరుకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లండి” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
ఇక “కర్ణాటకలో కన్నడ మాత్రమే ఉపయోగించాలని నేను నమ్ముతున్నాను. ఇంగ్లీష్ తో సహా అన్ని ఇతర భాషలను పరిమితం చేయాలి. ఎవరైనా ఇంగ్లీష్ వాడకాన్ని సమర్థిస్తే.. అదే తార్కికం ఇతర భాషలకు కూడా వర్తిస్తుంది. దీనిని శత్రుత్వంతో కాకుండా ఆలోచనాత్మకంగా పరిగణించండి” అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. “కర్నాటకలో ఉండే వాళ్లు కన్నడ నేర్చుకోవాలనేది మంచి నిర్ణయం. కన్నడిగులను గౌరవించే వ్యక్తిగా, కన్నడ మాట్లాడటానికి ఇతర ప్రాంతం వాళ్లకు అవగాహన కల్పించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కానీ, బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే, నజింగానే నేర్చుకోవాలనుకునే వారిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: ఇదేం దిక్కుమాలినతనం.. సన్నీ భయ్యపై నిప్పులు చెరిగిన సజ్జనార్!