Vijayawada: ముగ్గురు మైనర్ల మధ్య ఏం జరిగిందో తెలీదు. లాడ్జి నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. మరొకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే మృతుడు ఢిల్లీకి నుంచి విజయవాడకు వచ్చాడు. అసలు విజయవాడ లాడ్జిలో ఏం జరిగింది? అనేదానిపై కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు.
విజయవాడ సిటీలో మైనర్ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన బందరురోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన మయాంక్-కావ్యాన్ష్- అభిషేక్ మిశ్రా విజయవాడ వచ్చారు. టూరిస్టులుగా వారంతా వచ్చినట్టు తెలుస్తోంది. ముగ్గురు వయస్సు 16 లేదా 18 ఏళ్లు ఉంటాయని అంచనా. మూడు రోజుల కిందట 15న ఆదివారం బందరు రోడ్డులోని ఓ లాడ్జిలో దిగారు.
మంగళవారం మధ్యాహ్నం లాడ్జి స్వీపర్ గదిని శుభ్రం చేయడానికి వెళ్లింది. మయాంక్ తన గదిలో మంచం కింద విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని స్వీపర్.. లాడ్జి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన లాడ్జి సిబ్బంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లాడ్జి గదిని కుణ్నంగా పరిశీలించారు. లాడ్జిలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. గదిలో పదికి పైగా బీరు సీసాలను గుర్తించారు.
గదిలో దిగిన నుంచి మద్యం తాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మయాంక్ ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఒకవేళ హార్ట్‌ఎటాక్ వచ్చిందా? మద్యం ఎక్కువై ఊపిరాడక మృతి చెందాడా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మరి మయాంక్‌తోపాటు గదిలో దిగిన కావ్యాన్ష్-అభిషేక్ ఎక్కడ? సోమవారం రాత్రి 1.30 గంటల సమయంలో లాడ్జి నుంచి లగేజీతో వారిద్దరు రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. మయూంక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు చెప్పారు.
ALSO READ: అర్ధరాత్రి పెను విషాదం.. ఆ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం, ప్రకాశం జిల్లాలో ఘటన
పోస్టుమార్టం నివేదిక వస్తే మృతి వెనుక అసలు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. లాడ్జి నిర్వాహకులు ఫిర్యాదు మేరకు మైనర్ బాలుడిది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. మృతుడి జేబులోని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.