Alluri District News: జుట్టు విరబోసుకుని తిరుగుతున్నారనే కారణంతో 23 మంది విద్యార్ధినుల జుట్టు కత్తిరించారు ఉపాధ్యాయులు. ఈ అమానుష ఘటన అల్లూరి జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల కాలేజీలో చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి రోజున తల స్నానం చేసి జుట్టు విరబోసుకుని రావడంతో.. పనిష్మెంట్‌లో భాగంగా జుట్టు కట్ చేశారు. ఉపాధ్యాయులు. ఆ 23 మంది విద్యార్ధినుల ఉదయం ప్రతిజ్ఞకు కూడా హాజరు కాలేదని.. అందుకే పనిష్మెంట్ ఇచ్చామని ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో వారి తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.
మరోవైపు.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థి ఈనెల 12న చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు. సెకండియర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్లీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. ఆ విద్యార్థి వచ్చేసరికి హాస్టల్లో యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్.. విద్యార్థి కటింగ్ విషయాన్ని తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటికి తీసుకెళ్లి సెలూన్ షాప్ లో గుండు గీయించినట్లు బాధిత విద్యార్థి చెబుతున్నాడు.
Also Read: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు అప్పటి నుంచే
ఖమ్మం వైద్య కళాశాలలో విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. ఘటనపై ఎంక్వైరీ చేసి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఘటనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్‌ను ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించారు ఆ కాలేజీ ప్రిన్సిపల్. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు తెలిపారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్.