AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా వైజాగ్ లో ఈ నెలలో జరగబోయే సీఐఐ సమ్మిట్ పై చర్చ సాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్వాoటం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొంథా తుపాను సందర్భంగా మంత్రులు బాగా పనిచేశారని సీఎం అభినందనలు తెలిపారు. పార్టీ ఆఫీసుల లీజ్ కు సంబంధించిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా దాదాపు ఒక లక్ష కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ నూతన పాలసీలను రూపొందించిన ఫలితంగా దిగ్గజ కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది.
రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్ విడి భాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతుందన్నారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యమని చెప్పారు. 5 వేల మంది నిపుణులు, స్టార్టప్‌లు రాష్ట్రానికి వస్తాయని కేబినెట్ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖలో రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 50 ఎకరాల కేటాయించాలని నిర్ణయించింది. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంటు కోసం బిర్లా గ్రూప్‌నకు భూమి కేటాయించాలని నిర్ణయించింది. ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్‌కు 100 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.
అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్‌కు 150 ఎకరాల కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్‌కు 300 ఎకరాలకు పైగా భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Also Read: Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ సీఐఐ సమిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యేల బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు. వివాదాలు లేకుండా చూసుకోవడంపై జిల్లా మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.