PM Modi Mann Ki Baat: ప్రధాని మోదీ 130వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ.. ఏపీలోని అనంతపురం ప్రజల శ్రమను అభినందించారు. కరవు ప్రాంతమైన అనంతపురంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర నీటి కోరతను ఎదుర్కొంటారన్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక అధికారులతో కలిసి ప్రజలు స్వయంగా 10 జలాశయాలను పునరుద్ధరించారన్నారు. అలాగే 7 వేలకు పైగా చెట్లను నాటారని పేర్కొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అజంగఢ్ గురించి మోదీ మాట్లాడుతూ.. స్థానికులు తమసా నదిని పునరుద్ధరించి, బురద, చెత్తను తొలగించారు. నది ఒడ్డున చెట్లను నాటడం గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఈ రెండు సంఘటనలు స్థానిక పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరణకు ప్రజల భాగస్వామ్యాన్ని తెలియజేస్తుందన్నారు.
2016 నాటి జ్ఞాపకాలను ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆ ఏడాది జనవరిలో కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా’ గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అప్పట్లో చాలా మందికి పూర్తిగా అర్థం కాలేదన్నారు. కానీ నేడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా మారిందన్నారు. దీంతో ఇప్పుడు యువ వ్యవస్థాపకులు ఏఐ, అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ వంటి రంగాలలో పనిచేస్తున్నారన్నారు.
తమ కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వచ్చి వినూత్న ఆలోచనలు చేస్తు్న్న యువ ఎంటర్ ప్రెన్యూర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని చూస్తుందన్నారు. మాన్యుఫెక్చరింగ్, పరిశ్రమలలో యువత రాణిస్తున్నారన్నారు. గత ఏడాది గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’ కోసం తాను ఇచ్చిన పిలుపును మరోసారి గుర్తుచేశారు. దేశం ‘విక్షిత్ భారత్’ వైపు అడుగులు వేస్తుందన్నారు. భారతీయ ఉత్పత్తులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్ అత్యుత్తమ నాణ్యతకు చిహ్నంగా మారాలని మోదీ ఆకాంక్షించారు.
Also Read: “4.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి”: అమెరికా సుంకాలపై మోదీ మౌనం వీడాలి.. రాహుల్ గాంధీ నిప్పులు!
ఫిబ్రవరి 15-20 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ గురించి కూడా మోదీ మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో దేశాధినేతలు, ప్రపంచ సీఈవోలు, నిపుణులు ఏఐ సాంకేతికలో దేశం సాధించిన పురోగతిని చర్చించడానికి భారత్ వస్తున్నారన్నారు.