Pani Puri Recipe: సాయంత్రం అయ్యిందంటే చాలు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మన మనసంతా ఆ పానీపూరీ బండి చుట్టే తిరుగుతుంది. పుల్ల పుల్లని పానీ, కరకరలాడే పూరీ తింటే వచ్చే మజాయే వేరు. కానీ రోడ్డు పక్కన ఆ దుమ్ము, ధూళి, డ్రైనేజీలు, ముఖ్యంగా పానీపూరీ వడ్డించే విధానం చూసినప్పుడు మాత్రం తినాలంటే కొంచెం భయం వేస్తుంది. అలాగని ఇష్టమైన ఫుడ్‌ని వదులుకోలేం కదా. అందుకే పానీపూరీ పూరీలను బయట ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నా.. అందులోకి రుచికరమైన పానీని మాత్రం ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం రండి..
Also Read: 10 నిమిషాల్లో అదిరిపోయే బచ్చలికూర రోటి పచ్చడి.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!
ఎండిన పుదీనా ఆకుల పొడి – 2.5 టేబుల్ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – ఒకటీస్పూన్
ధనియాల పొడి – ఒకటీస్పూన్
బ్లాక్ సాల్ట్ – ఒకటీస్పూన్
శొంఠి పొడి – అర స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ – అర స్పూన్
పంచదార – అర స్పూన్
ఇంగువ – కొద్దిగా
సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్ – చిటికెడు
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. పొడి బరకగా ఉంటే నీళ్లలో సరిగ్గా కలవదు. కాబట్టి పిండిలా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన ఘుమఘుమలాడే పానీపూరీ మసాలా పొడిని ఒక తడి లేని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు పానీపూరీ తినాలనిపించినప్పుడు ఒక కప్పు చల్లని నీళ్లలో అర చెంచా ఈ మసాలా పొడిని కలిపితే చాలు.. అచ్చం బయట బండి మీద దొరికే పానీ లాంటి రుచితో పానీ సిద్ధమైపోతుంది. కావాలంటే దీనిలో కాస్త నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.
Also Read: క్యాబేజీ తినని వాళ్లు కూడా ఫిదా అవ్వాల్సిందే.. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి!