Rains In AP: ఆంధ్రప్రదేశ్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. అల్పపీడనం క్రమంగా బలపడి ఒడిశా-ఏపీ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 3 , 4 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడవచ్చని అంచనా వేసింది. ఇది దక్షిణ ఒడిషా-ఏపీలోని ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశముందని తెలిపింది. దీని కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశముందని తెలియజేసింది.
దక్షిణ కోస్తాంధ్ర-రాయలసీమ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కర్ణాటక-తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావం కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. గురువారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ALSO READ: బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!
ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాకాలం వచ్చినా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు. ఏకంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు వేసి కొందరు, వేయక మరికొందరు ఇబ్బందిపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఉక్కపోతతో విద్యుత్ వినియోగం అమాంతంగా పెరిగిందని చెబుతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. మరి రానున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం కలుగుతుందా? అనేది చూడాలి.