SV Museum: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనుల క్రెడిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగిలించడానికి యత్నిస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ మ్యూజియం అభివృద్ధి పనులకు నాంది పడిందని, అసలు వాస్తవాలు హిందూ భక్తులందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
85 శాతం పనులు జగన్ హయాంలోనే..
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో.. లండన్ మ్యూజియం తరహాలో ఎస్వీ మ్యూజియంను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు భూమన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం టాటా సంస్థ సి.ఎస్.ఆర్ నిధుల నుంచి రూ. 125 కోట్లు కేటాయించగా.. బెంగళూరుకు చెందిన ‘మ్యాప్’ సంస్థ రూ. 20 కోట్ల సహకారం అందించినట్లు వెల్లడించారు. 14 గ్యాలరీలతో, రాగి రేకులు, మైసూర్ మహారాజా ముత్యాల పల్లకి, స్వామివారి బంగారు ఆభరణాలు భద్రపరిచేలా ప్రముఖ ఇంజనీర్లతో డిజైన్ చేయించి, వైకాపా ప్రభుత్వ హయాంలోనే 85 శాతం పనులు పూర్తి చేశామని ఆయన వివరించారు.
క్రెడిట్ చోరీపై మండిపాటు
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన 15 శాతం పనులను పూర్తి చేయడానికి ఏకంగా రెండున్నరేళ్ల సమయం తీసుకుని కాలయాపన చేశారని విమర్శించారు. జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం చేశారని, ఏఐ టెక్నాలజీ పేరుతో మ్యూజియం రూపురేఖలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను వేగంగా పూర్తి చేశామంటూ ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తూ, చంద్రబాబు చేస్తున్నది కేవలం క్రెడిట్ చోరీ మాత్రమేనని భూమన ఆక్షేపించారు.
Also Read: చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!