AP SLBC Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఏపీ ఆర్థిక పురోగతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని చివరి వ్యక్తి వరకు బ్యాంకింగ్ సేవలు అందాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ భేటీలో వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, పునరుత్పాదక ఇంధన రంగాలు ప్రధాన అజెండాగా నిలిచాయి. ఆర్థిక ప్రగతి వేగం పుంజుకోవడానికి బ్యాంకర్లు తమ సహాయ సహకారాలను మరింత పెంచాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
క్రెడిట్ పురోగతిపై సమీక్ష..
ఈ భేటీలో రాష్ట్రంలో క్రెడిట్ పురోగతిపై సమీక్ష జరిపారు. 2026 జూన్ నాటికి మొత్తం బ్యాంకింగ్ అడ్వాన్సులు రూ. 10.28 లక్షల కోట్లకు చేరుకోవడం సానుకూల పరిణామంగా నిలిచింది. వ్యవసాయ రంగానికి అందిస్తున్న మద్దతులో భాగంగా రుణాలు రూ. 3.98 లక్షల కోట్లకు పెరిగాయి. అదేవిధంగా, MSME రంగానికి తొలి త్రైమాసికంలోనే 2.33 లక్షల యూనిట్లకు రూ. 63,686 కోట్లు అందించినప్పటికీ, నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడంలో కొన్ని బ్యాంకులు వెనుకబడటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశంలో ప్రస్తావించిన 13 అంశాలలో 4 అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటాన్ని తప్పుపడుతూ, బ్యాంకర్లు మరింత వేగంగా స్పందించాలని సూచించారు.
సరికొత్త రికార్డు సృష్టించిన ఏపీ మహిళలు!
డ్వాక్రా మహిళల రుణాల చెల్లింపుల తీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు 99 శాతానికి పైగా రీపేమెంట్‌తో దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచాయని, కేవలం 0.67 శాతం మాత్రమే డిఫాల్ట్ అయిందని కొనియాడారు. వీరికి మరింత ఆసరా ఇచ్చేలా SHG రుణాలపై సర్వీస్ ఛార్జీలను పూర్తిగా మినహాయించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సెప్టెంబర్ 10 నాటికి SHGలకు రూ. 18,621 కోట్లు, పీఎం ముద్ర యోజన కింద రూ. 13,757 కోట్లు మంజూరు చేశారు. అలానే మిగిలిపోయిన స్వల్ప రుణాల రికవరీకి ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ విధానాన్ని పరిశీలించాలని బ్యాంకర్లకు సూచించారు.
బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు..
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు పీఎం సూర్య ఘర్ పథకం కింద 1.57 లక్షల దరఖాస్తులకు రూ. 3,081 కోట్ల రుణాలను అందించారు. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలు ఇవ్వాలని, ఆర్థిక వ్యవస్థకు సైబర్ నేరాలు సవాలుగా మారుతున్నందున డీజీపీ సైబర్ సెక్యూరిటీ సెల్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రగతి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read: కేసీఆర్ కుటుంబానికి బిగుసుకున్న ఉచ్చు.. భూ అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధం!