Andhra Pradesh Wildlife: ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతాల్లో పులుల సంతతిని పెంచేందుకు, జీవ వైవిధ్యానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ముంబై పర్యటనలో ఒక కీలకమైన ముందడుగు వేశారు. ఏపీ అడవుల్లో ముఖ్యంగా తూర్పు కనుమల్లో పులుల సంఖ్యను శాస్త్రీయంగా పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆయన జరిపిన చర్చలు ఫలించాయి. మహారాష్ట్ర నుంచి రెండు ఆడ పులులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కల్యాణ్ భేటీ..
ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు, ప్రధానంగా తూర్పు కనుమల్లో వన్యప్రాణుల సంరక్షణపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలోని అటవీ ప్రాంతాల్లో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్రానికి రెండు ఆడ పులులను కేటాయించాలని ఆయన చేసిన విజ్ఞప్తికి ఫడ్నవీస్ తక్షణమే సానుకూలంగా స్పందించి, ఇందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
‘ఇన్ బ్రీడింగ్’ సమస్యకు చెక్.. జన్యు వైవిధ్యానికి పచ్చజెండా!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఆడ పులుల కొరత కారణంగా ‘ఇన్ బ్రీడింగ్’ సమస్య తీవ్రమవుతోంది. దీనివల్ల పుట్టే పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గడం, జన్యుపరమైన లోపాలు తలెత్తడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి రానున్న కొత్త ఆడ పులుల వల్ల అడవుల్లో జన్యు వైవిధ్యం (Genetic Diversity) పెరుగుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వినూత్న ప్రయోగం ద్వారా భవిష్యత్తులో పులుల జనాభా ఆరోగ్యకరంగా, దీర్ఘకాలికంగా స్థిరపడుతుందని అటవీ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అలాగే శాస్త్రీయ పద్ధతులు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ విధానాల ద్వారానే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమని నమ్ముతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు తోడుగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కేవలం వన్యప్రాణులే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని ఉమ్మడి అంశాలపై కలిసి కట్టుగా ముందడుగు వేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిరంతరం అండగా నిలుస్తూ, తగిన మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఏపీ ప్రభుత్వం తరపున పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తూర్పు కనుమల్లో కొత్త వెలుగులు..
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సరికొత్త అంతర్-రాష్ట్ర పులుల బదిలీ కార్యక్రమం తూర్పు కనుమల్లో ఒక ఆరోగ్యకరమైన, సంపూర్ణమైన అటవీ పర్యావరణ వ్యవస్థ (Eco System) ఏర్పాటుకు ఎంతగానో దోహదపడుతుందని పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే రోజుల్లో ఏపీ అడవులకు కొత్త కళను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: మళ్లీ పడిపోతున్న పసిడి రేట్లు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్!