Tata Sons Next Chairman: ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో టాటా గ్రూప్ లో తర్వాత బాస్ ఎవరనే చర్చ మొదలైంది. చంద్రశేఖరన్ రాజీనామా చేసినా, వెంటనే పదవి నుంచి తప్పుకునే అవకాశం లేదు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022లో ఆయనకు మరో ఐదేళ్ల పదవీకాలం లభించింది. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్‌లో ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్‌కు మరింత ప్రాధాన్యం వచ్చింది. తాజాగా ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో తర్వాత.. ఈ ప్రతిష్టాత్మక సంస్థను ఎవరు లీడ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి చంద్రశేఖరన్ తర్వాత.. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా పేరు సహజంగానే వినిపిస్తోంది. కానీ ఆయన టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ కావడం అంత సులభం కాదు. దానికి ప్రధాన కారణం 2022లో టాటా సన్స్ చేసిన కీలక మార్పు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోని ఆర్టికల్ 118ను సవరించారు. దీని ప్రకారం సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ లేదంటే సర్ రతన్ టాటా ట్రస్ట్ కు ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి అదే సమయంలో టాటా సన్స్ ఛైర్మన్ గా ఉండటానికి అవకాశం లేదు. ఈ మార్పును 2022 ఆగస్టులో వాటాదారులు ఆమోదించారు. అంటే, ప్రస్తుతం టాటా ట్రస్ట్స్ కు నాయకత్వం వహిస్తున్న నోయెల్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ పదవిని ఒకేసారి చేపట్టలేరు. టాటా సన్స్ నిర్వహణ, టాటా ట్రస్ట్స్ యాజమాన్య ప్రభావం రెండూ ఒకే వ్యక్తి చేతుల్లోకి వెళ్లకుండా ఈ నిబంధన తీసుకొచ్చారు.
టాటా సన్స్ బోర్డులో నోయెల్ టాటాతో పాటు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్, హరీష్ మన్వానీ, అజయ్ పిరమల్, అనితా మరంగోలీ జార్జ్, రాల్ఫ్ స్పెత్, సౌరభ్ అగర్వాల్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఎవరు తదుపరి ఛైర్మన్ అవుతారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. టాటా సన్స్ నియమాల ప్రకారం ఛైర్మన్ ఎంపిక కోసం ఒక కమిటీ అభ్యర్థిని సిఫారసు చేయాలి. ఆ తర్వాత బోర్డు, అవసరమైన ఆమోదాలకు లోబడి, తుది నిర్ణయం తీసుకుంటుంది.
సో, టాటా కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే తదుపరి ఛైర్మన్ అవుతారనేది కరెక్ట్ కాదు. గతంలో చంద్రశేఖరన్ ఎంపికైన విధానాన్ని చూస్తే, గ్రూప్‌లోని కీలక వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిన సీనియర్ ప్రొఫెషనల్‌కు అవకాశం రావచ్చు. టాటా సన్స్‌లో ఇప్పటికే అనుభవం ఉన్న సౌరభ్ అగర్వాల్ లాంటి పేర్లు కూడా పరిశీలనలోకి రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి చర్చలు మాత్రమే.
ఈసారి వారసత్వ మార్పు మరింత కీలకంగా మారడానికి మరో కారణం టాటా సన్స్ భవిష్యత్తు. ఆర్‌బీఐ నిబంధనలు, టాటా సన్స్ లిస్టింగ్ అంశం, టాటా ట్రస్ట్స్ పాత్ర వంటి విషయాలు ముందున్న ఛైర్మన్‌కు పెద్ద సవాళ్లుగా మారవచ్చు. టాటా ట్రస్ట్స్ కు టాటా సన్స్ లో సుమారు 66 శాతం వాటా ఉంది. మరోవైపు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు సుమారు 18.4 శాతం వాటా ఉంది. టాటా సన్స్ భవిష్యత్ వ్యూహాల విషయంలో ఈ వాటాదారుల ప్రయోజనాలు కూడా ముఖ్యమైనవే. అందువల్ల చంద్రశేఖరన్ తర్వాత వచ్చే వ్యక్తి కేవలం సంస్థకు కొత్త ఛైర్మన్ మాత్రమే కాదు. టాటా గ్రూప్ ను భవిష్యత్తులో ఏ దిశగా తీసుకెళ్లాలో నిర్ణయించే కీలక నాయకుడిగా మారనున్నారు. ప్రస్తుతానికి అధికారిక వారసుడి పేరు బయటకు రాలేదు. తుది నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉండాయి.
Read Also: జంషెడ్జీ టాటా To చంద్రశేఖరన్.. టాటా సంస్థను ముందుకు నడిపిన ప్రముఖులు వీళ్లే!