Amaravati: అమరావతిని నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. డీప్ టెక్ కేపిటల్ గా అమరావతి ప్రపంచస్థాయి నగరంగా నిర్మాణం అవుతుందన్నారు. ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరిరోజు అవుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్నారు. విశాఖ, అమరావతి, తిరుపది ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడంతో వృద్ధిరేటు 11.3 శాతానికి చేరిందని వివరించారు.
రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడారు. జాతీయ జెండా మన చేతిలో ఉండాలని, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలన్నారు. స్వాతంత్ర్య సమరంలో తెలుగు నేల తనదైన ముద్ర వేసిందన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే.. దేశ భవిష్యత్తును గొప్పగా నిర్మించడమేనని చెప్పుకొచ్చారు.
దేశం.. మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిందన్నారు. నా దేశం-నా బాధ్యత అని ముందుకు సాగాలన్నారు. దేశం నాకు ఏం చేసిందని కాదని, దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలన్నారు. వికసిత్ భారత్-2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వందేళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం-రాష్ట్రం వికాసం నుంచి వైభవం వైపు సాగాలన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.
అటు కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఒక తరం స్వాతంత్య్రం కోసం పోరాడితే.. ఒక తరం స్వాతంత్య్రాన్ని కాపాడుతుందన్నారు. యువతే దేశ భవిష్యత్ అనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు. బలమైన, సమర్త దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేయాలన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ఏపీ తనదైన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రశ్నించడమేకాదు.. పరిష్కారాలను యువత చూపాలన్నారు.
ALSO READ: తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!