E-Paper
Advertisement

ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?
Advertisement

Independence Day History: భారత దేశానికి ఆగస్టు 15వ తేదీ ఎంతో కీలకమైనది. 1947 ఆగస్టు 14 అర్థరాత్రి తర్వాత.. బ్రిటీష్ ఇండియా పరిధిలోని రెండు విభిన్న దేశాలుగా భారత్, పాకిస్థాన్‌లు అవతరించాయి. సుమారు 200 ఏళ్ల బ్రిటీష్ వలస పాలనకు ముగింపు పలుకుతూ ‘ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్’ అమల్లోకి వచ్చింది. దీంతో 1947 ఆగస్టు 15 నుండి భారత్, పాకిస్థాన్ అనే పేరుతో రెండు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాలుగా ఏర్పడ్డాయి. అయితే రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్రం వచ్చినప్పటికీ.. పాక్ మాత్రం ఒకరోజు ముందు అంటే ఆగస్టు 14న ఇండిపెండెన్స్ వేడుకలను జరుపుకోవడం చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. దీని వెనుక ఉన్న చారిత్రక కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

లార్డ్ మౌంట్‌బాటన్ షెడ్యూల్ వల్లే..

చారిత్రక ఆధారాల ప్రకారం.. రెండు దేశాల వేడుకల తేదీల్లో వ్యత్యాసానికి ప్రధాన కారణం నాటి బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ షెడ్యూల్. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీనే భారత్, పాకిస్తాన్ లకు స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అదే రోజున భారత్, పాక్ కు వెళ్లి అధికార మార్పిడి పత్రాలపై సంతకాలు చేయడం అసాధ్యమని మౌంట్ బాటన్ భావించారు. మరోవైపు భారత్ ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాతంత్ర వేడుకలు జరపాలని ముందే నిర్ణయించింది. దీంతో పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సమక్షంలో కరాచీలోని రాజ్యాంగ పరిషత్‌లో ఆగస్టు 14నే అధికార మార్పిడి నిర్వహించడానికి అంగీకారం కుదిరింది.

ఆగస్టు 14 వెనుక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత!

Advertisement

ప్రారంభంలో పాకిస్థాన్ కూడా ఆగస్టు 15నే తమ స్వాతంత్ర్య దినోత్సవంగా భావించింది. కానీ కొద్దిరోజుల తర్వాత ఆగస్టు 14కు మార్చుకుంది. దీని వెనుక మతపరమైన కారణాలు కూడా దాగున్నాయి. 1947 ఆగస్టు 14వ తేదీ.. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలోని 27వ రోజు (షబ్-ఎ-ఖద్రు)తో కలిసి వచ్చింది. దీంతో ఆ తేదీకి మరింత ప్రాధాన్యతను ఇస్తూ మహమ్మద్ అలీ జిన్నా ఆ తేదీని ఖరారు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

భారత్‌లో స్వాతంత్ర సంబురాలు

ఇదిలా ఉంటే కరాచీ కార్యక్రమం పూర్తయ్యాక మౌంట్‌బాటన్ వెంటనే ఢిల్లీకి చేరుకున్నారు. అధికారిక మార్పిడికి సంబంధించి నెహ్రూ సమక్షంలో సంతకాలు చేశారు. దీంతో ఆగస్టు 14 అర్థరాత్రి వేళ.. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉన్న లాహోరి గేట్ దగ్గర నిలబడి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ‘ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ.. భారతదేశం స్వాతంత్ర్యం వైపు అడుగులు వేస్తోంది’ అని ఉద్వేగభరితంగా ప్రకటించారు.

పాక్‌కు ముందే ఫ్రీడమ్ వచ్చిందా?

Advertisement

అయితే పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తుండటంతో మనకంటే ఒకరోజు ముందే ఆ దేశానికి అధికారాలు బదిలి అయ్యాయని అంతా భావిస్తుంటారు. కానీ అది తప్పు. పాకిస్థాన్ ఒక రోజు ముందు వేడుకలు జరుపుకున్నంత మాత్రాన ఆ దేశానికి భారత్ కంటే ముందే స్వాతంత్ర్యం వచ్చిందని కాదు. ఎందుకంటే ‘ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్’ ప్రకారం రెండు దేశాలకు ఆగస్టు 15వ తేదీనే అధికారం బదిలి జరిగింది. సంతకాల సౌలభ్యం కోసం మాత్రమే ఆగస్టు 14న మౌంట్ బాటన్ పాక్ కు వెళ్లారు.

Also Read: రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్!

ఆగస్టు 15 తేదీతో జపాన్‌కు లింకేంటి!

నిజానికి బ్రిటిష్ వారు 1948 జూన్ నాటికి భారత్‌ను విడిచిపెళ్లాలని భావించారు. కానీ నాటి దేశ విభజన హింస, శాంతిభద్రతల క్షీణత కారణంగా మౌంట్‌బాటన్ స్వాతంత్ర తేదీని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టుకి మార్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ శత్రుసేనలు లొంగిపోయి ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజుకు గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నట్లు మౌంట్‌బాటన్ తర్వాతి రోజుల్లో వెల్లడించారు.

Also Read: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రతి భారతీయుడూ.. తప్పక చూడాల్సిన 10 సరిహద్దు ప్రాంతాలు!

Tags

Related News

ఐఐటీ బంపరాఫర్.. ఏడాదిపాటు ఏఐ కోర్సు ఉచితం.. భోజనం-స్టైఫండ్‌ కూడా

జనగణనలో మొత్తం 40 ప్రశ్నలు ఇవిగో, కులంతోపాటు బ్యాంకు అకౌంట్లు కూడా

పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!

తనకు-విద్యార్థుల మధ్య వ్యవహారం.. బార్ కౌన్సిల్ నిర్ణయంపై సీజేఐ రియాక్ట్

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, ఇంకా

ఎర్రకోట పేలుడు వెనుక ‘అల్ ఖైదా’.. ఐరాస భద్రతా మండలి సంచలన నివేదిక!

Big Stories

Advertisement
×