Tata Sons Chairmans History: భారతదేశంలో అత్యంత పేరున్న దిగ్గజ వ్యాపార సంస్థల్లో టాటా గ్రూప్ ఒకటి. 1868లో జంషెడ్జీ టాటా ప్రారంభించిన ఈ సంస్థ.. నెమ్మది నెమ్మదిగా భారీ సామ్రాజ్యంగా ఎదిగింది. ఈ ప్రయాణంలో టాటా సన్స్ కు పలువురు ప్రముఖులు నాయకత్వం వహించారు. తాజాగా ఈ సంస్థ చైర్మెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. కారణాలు ఏమైనప్పటికీ.. దేశ వ్యాపార రంగంలో ఓ షాకింగ్ న్యూస్ అయ్యింది. ఈ నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా నుంచి ఎన్. చంద్రశేఖరన్ వరకు టాటా సన్స్ సంస్థను నడిపించిన ఏడుగురు ప్రముఖ నాయకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టాటా గ్రూప్ కు పునాది వేసిన వ్యక్తి జంషెడ్జీ టాటా. 1868లో వ్యాపార సంస్థను ప్రారంభించిన ఆయన తర్వాత నాగ్ పూర్ లో ఎంప్రెస్ మిల్ ను స్థాపించారు. ముంబైలో తాజ్ మహల్ హోటల్ ను కూడా నిర్మించారు. దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఆయన వేసిన పునాది టాటా గ్రూప్ భవిష్యత్తుకు కీలకంగా మారింది.
1904లో జంషెడ్జీ టాటా మరణించిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు దోరబ్జీ టాటా కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో టాటా గ్రూప్ మరింత విస్తరించింది. 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ప్రారంభించారు. అదే సంస్థ తర్వాత టాటా స్టీల్‌గా మారింది. టాటా గ్రూప్‌ను పారిశ్రామిక రంగంలో బలమైన సంస్థగా తీర్చిదిద్దడంలో దోరబ్జీ కీలక పాత్ర పోషించారు.
దోరబ్జీ టాటా తర్వాత 1932లో నౌరోజీ సక్లత్వాలా టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యారు. ఆయన జంషెడ్జీ టాటాకు మేనల్లుడు. అయితే, ఆయన పదవీకాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1938లో ఫ్రాన్స్ లో ఆయన మరణించారు.
1938లో జెహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా, అంటే జె.ఆర్.డి. టాటా, టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 53 సంవత్సరాల పాటు ఆయన సంస్థకు నాయకత్వం వహించారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ అనేక కొత్త రంగాల్లోకి అడుగుపెట్టింది. 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ ను ప్రారంభించారు. అదే సంస్థ తర్వాత టాటా ఎయిర్ లైన్స్ గా, అనంతరం ఎయిర్ ఇండియాగా మారింది. 1945లో టాటా మోటార్స్ కు పునాది పడగా, 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రారంభమైంది.
1991లో జె.ఆర్.డి. టాటా పదవి నుంచి తప్పుకున్న తర్వాత రతన్ టాటా టాటా సన్స్ ఛైర్మన్ అయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైన సమయంలో ఆయన సంస్థకు నాయకత్వం వహించారు. రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి ప్రముఖ కంపెనీల కొనుగోళ్లు సంస్థకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చాయి.
2012లో రతన్ టాటా ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. టాటా కుటుంబానికి చెందని వ్యక్తిగా ఆయన ఈ పదవిలోకి వచ్చారు. అయితే, ఆయన పదవీకాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2016లో టాటా సన్స్ బోర్డు ఆయనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. అనంతరం రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
2017లో ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టీసీఎస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 2009లో ఆ సంస్థకు సీఈఓ అయ్యారు. టాటా కుటుంబంతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తిగా టాటా సన్స్ కు పూర్తి స్థాయి ఛైర్మన్ అయిన తొలి వ్యక్తిగా చంద్రశేఖరన్ గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ పలు రంగాల్లో విస్తరణ కొనసాగించింది. జంషెడ్జీ టాటా ప్రారంభించిన ప్రయాణం.. టాటా గ్రూప్ గా విస్తరించింది. ప్రతి ఛైర్మన్ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
Read Also: టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా.. కుప్పకూలిన షేర్లు.. గుడ్ బైకి కారణం అదేనా?