AP Govt: ఏపీలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుపాను ప్రభావం ప్రజలపై ఏ మాత్రం పడకుండా నవంబర్ రేషన్‌ను మంగళవారం నుంచి పంపిణీ చేయనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మొంథా తుపాను ఓ కుదుపు కుదిపేస్తోంది. దీని ధాటికి రవాణా సౌకర్యాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చని భావించింది చంద్రబాబు సర్కార్.
ఏపీలో నేటి నుంచి రేషన్ సరఫరా
ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావానికి గురయ్యే 12 జిల్లాల్లో నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను ముందుగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆశాఖ ఆదేశాలు జారీ చేసింది. నార్మల్‌గా ప్రతి నెలా ఒకటిన రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. ఈసారి అక్టోబర్ 28 నుంచే అమలు చేయనుంది.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని రేషన్ కార్డుదారులకు రేషన్ సరకులను ముందుగా పంపిణీ చేయనున్నారు. తుపాను పరిస్థితులపై సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహనర్ ఏలూరులో జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహంచారు.
12 జిల్లాలపై ప్రభుత్వం ఫోకస్
ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో 14 వేల పైచిలుకు రేషన్ షాపులు ఉన్నాయి. దాదాపు ఏడు లక్షల మంది లబ్దిదారులకు రేషన్ సరుకులు మంగళవారం నుంచి అందనున్నాయి. మిగతా జిల్లాల్లో యథావిధిగా నవంబర్ ఒకటి నుంచి రేషన్ అందించనున్నారు.
ఇప్పటికే సంబంధిత జిల్లాలకు రేషన్ సరుకులు బియ్యం, పామాయిల్, పంచదార వాటిని తరలించారు అధికారులు. దీనికితోడు రానున్న మూడు రోజులు ఆయా జిల్లాల్లో పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా ఆయా కంపెనీలతో మాట్లాడి చర్యలు చేపట్టారు. 12 జిల్లాల పరిధిలోని 625 పెట్రోలు బంకులు ఉన్నాయి. దాదాపు 35 వేల కిలో లీటర్ల ఆయిల్ అందుబాటులో ఉంచారు.
ALSO READ: ఏపీలో వేగంగా కదులుతున్న మొంథా, కాకినాడ తీరానికి సమీపంలో
ఒకవేళ విద్యుత్ సమస్యలు తలెత్తినా ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. మొబైల్ టవర్లు పని చేసేలా వాటి జనరేటర్లకు డీజిల్ అందించనుంది. అలాగే రైతులు నష్టపోకుండా రైతు సేవా కేంద్రాల్లో 30 వేల టార్పాలిన్ పట్టాలు ఉండారు. చేతికి అందివచ్చిన ధాన్యం తడవకుండా వాటిని వినియోగించుకోవాలని రైతులకు సూచన చేశారు.