Badvel: టీడీపీ ఆవిర్బావం నుంచి టిడిపి కి కంచుకోటగా ఆ నియోజకవర్గంలో గత రెండు దశాబ్దాలుగా పార్టీ ఉనికి కోసం పోరాడుతుంది .. జిల్లాలో రాజకీయ ఉద్దంతుడిగా చక్రం తిప్పిన బిజివేముల వీరారెడ్డి దివంగతులు అయ్యాక నేటికీ ఆ కుటుంబసభ్యులే ఆ నియోజకవర్గం ఇన్చార్జ్‌గా ఉన్నా గెలుపు ముంగిట ప్రతిసారీ బోల్తా పడుతున్నారు.. దాంతో ఇంతకాలం పార్టీ ఇన్చార్జ్ ఉండి పార్టీకి చేసిందేంటి, కొత్త వ్యక్తులకు నియోజకవర్గం ఇన్చార్జ్ భాద్యతలు అప్పగించాలని కొంతమంది నేతలు పట్టుబడుతున్నారట..అది ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు రాజేసింది.. ఇంతకీ బద్వేలు టీడీపీలో ఆ పరిస్థితి కారణమేంటి?
కడప జిల్లా బద్వేల్ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కంచుకోట.. బద్వేల్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పనిచేసిన ఘనత బిజివేముల వీరారెడ్డిది. బద్వేలు నియోజకవర్గాన్ని తను కంచుకోటగా మార్చుకొని బద్వేల్ వీరారెడ్డిగా పేరు గడించారు. వీరారెడ్డి మరణం తర్వాత వారసత్వంగా రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన ఆయన కుమార్తె విజయమ్మ 2001 లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించినా ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
2009 నుంచి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి తెలుగుదేశం దేశం పార్టీ కష్టాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా ఇన్చార్జ్ మాత్రం విజయమ్మ కొనసాగుతున్నారు. ఇటీవల 2024 ఎన్నికల ముందు నుంచి విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ టీడీపీలో వార్ మొదలైందట. ఇన్చార్జ్ భాద్యతలు కొత్త వ్యక్తికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు దగ్గర ఓ వర్గం పట్టుబట్టడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం అధిష్టానం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయం సేకరించడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
బద్వేల్ నియోజకవర్గం టీడీపీ భాద్యతలు విజయమ్మ, ఆమె కుమారుడు రితేష్ రెడ్డి పర్యవేక్షుస్తున్నారు. 2009 ఎన్నికల నుంచి విజయమ్మ కుటుంబం ఎవరు పేరు చెబితే వారికే అధిష్టానం టికెట్ కేటాయిస్తోంది. అయినా ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థి గెలవకపోవడంపై తెలుగుతమ్ముళ్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో విజయమ్మ, రితీష్ రెడ్డి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావడం వల్లే ఓటమి పాలవుతున్నామంటూ నియోజకవర్గం క్యాడర్ తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు.
వీరారెడ్డి కుటుంబానికి విధేయుడుగా విజయమ్మ, రితీష్ రెడ్డి లతో కలిసి పనిచేస్తు వచ్చారు ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి. ఆయన సడెన్‌గా నియోజకవర్గ ఇన్చార్జ్‌గా పోటీలో ఉన్నారంటూ జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రచారాన్ని బలపరుస్తు అధిష్టానం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అధిష్టానం అభిప్రాయ చేపట్టడంతో ఇన్చార్జ్ మార్పు తప్పదు అని ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.
నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పుపై ఒక వైపు జోరుగా ప్రచారం సాగుతుంటే రితేష్ రెడ్డి అనుచరులు మాత్రం వీరారెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరిని నియమించినా ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. నియోజకవర్గం ప్రజల కోసం వీరారెడ్డి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని వీరారెడ్డి నాలుగు దశాబ్దాల పాటు బద్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎంతో అభివృద్ధి చేశారని ఆయన తర్వాత కుమార్తె, మనవడు పార్టీ కోసం పనిచేస్తున్నారని గట్టిగా వాదిస్తున్నారు. మరి అధిష్టానం ఇన్చార్జ్ విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి మరి.
Story by Apparao, Big Tv