ESMA Act : ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రాకపోడవంతో నిరసనలు తీవ్రం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది.
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సేవలను అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. చిన్న పిల్లలు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్‌వాడీలతో పలు మార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. అంగన్‌వాడీల బాధ్యతలను ప్రభుత్వం తాత్కాలికంగా వార్డు వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది.
ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.
26 రోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నారు. వారిపై ఏపీ ప్రభుత్వం శనివారం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. వీరిని అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొచ్చింది. జీవో నెంబర్ 2ను జారీ చేసింది. 6 నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధించింది.