TGPSC Group 2 Results: తెలంగాణలో ఉద్యోగ నియామకాలు హై స్పీడ్ లో జరుగుతున్నాయి. వివాదాలకు తావులేకుండా పరీక్షల నిర్వహణ, ఫలితాలు విడుదలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నియామకాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన 783 గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరింది. రేపు గ్రూప్-2 తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్-2 ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయడానికి టీజీపీఎస్సీ సన్నద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 28న 783 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ గ్రూప్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఫలితాలపై టీజీపీఎస్పీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సహా పలు ముఖ్యమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. 2024 డిసెంబర్ లో రాత పరీక్ష నిర్వహించారు. 2025 మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితా విడుదలైంది.
గ్రూప్-2 పరీక్షల నిర్వహణ అనంతరం 783 పోస్టులకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది కమిషన్. మొత్తం మూడు దశల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసింది. ముందుగా రెండు విడతల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు.
పలు పోస్టులకు సరైన అభ్యర్థులు కోసం మెరిట్ జాబితా నుంచి మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు మూడో విడత వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ పూర్తికావడంతో తుది ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ సన్నద్ధం అయింది. రేపు గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫలితాలు విడుదల తర్వాత గ్రూప్-3 ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు
టీజీపీఎస్సీ ఇటీవలె గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసింది. గ్రూప్-1 నియామకాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. గ్రూప్-2 తుది ఫలితాలు విడుదల అనంతరం ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది.