Group-1 Appointment Orders: ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన 562 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్-1 నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంలగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు.. తెలంగాణ ఎక్కడున్నది.. ఎక్కడ ఉంటది అని.. వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. తెలంగాణ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటది. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం. ఇది తెలంగాణ భవిష్యత్. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయి. ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ కొంత మంది కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలు వారికి నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారు. నమ్మకద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యం. ఒక యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించారు. ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. పరీక్షలు నిర్వహించాం.. ఇది కొంతమందికి నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో అందరికీ తెలుసు’ అని సీఎం వ్యాఖ్యానించారు.
ALSO READ: CM Chandrababu: 15 నెలల్లో 4.7 లక్షల ఉద్యోగాలు.. ఇది మా ఘనత: సీఎం చంద్రబాబు
‘కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపిస్తున్నారు. అయినా మీ భవిష్యత్ కోసం కొట్లాడినం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో దిగమింగాం. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు నాకు మీ భవిష్యత్ మాత్రమే కనిపించింది. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చెయ్యకండి.. ఒక బాధ్యతతో వ్యవహరించండి. మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దాం’ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు మీరు సహకారం అందించాలి. ఇక నుంచి మీరు తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్.. మీరు, మేము కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం.. మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు
ఈ సందర్భంగా గ్రూపు-1 ఉద్యోగం సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ జీతంలో 10 శాతం కట్ చేసి మీ పేరెంట్స్‌కు ఇస్తామని తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన చట్టం కూడా తీసుకొస్తామని సీఎం కీలక వ్యాఖ్యలు చేశఆరు.