Public Reaction On AP Liquor: ఏపీలో మందుబాబుల డిమాండ్స్ మామూలుగా లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. మా ఆశలు అడియాశలు చేయవద్దు ప్లీజ్ సీఎం సార్. మా డిమాండ్స్ మీరు పట్టించుకోవాలి. మాకు హామీ ఇచ్చారు. ఇదొక్క పని చేయండి చాలు.. మేము మిమ్మల్ని దేవుడిలా చూసుకుంటాం అంటున్నారు కొందరు మందుబాబులు. ఇంతకు వారి డిమాండ్స్ ఏమిటి ? ప్రభుత్వం నుండి అసలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుందాం.
ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచిందని, పరిచయం లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చిందని నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న, నేటి సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే బ్రాండెడ్ మద్యంతో పాటు, ధరలు తగ్గిస్తామని నాడు మందుబాబులకు హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు.. పాలనా పగ్గాలు చేపట్టారు సీఎంగా చంద్రబాబు.
తాను ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని సీఎం చంద్రబాబు అమలులోకి తెచ్చారు. ఇటీవల నూతన మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరించి, లాటరీ పద్దతి ద్వారా షాపుల యాజమానులను ప్రకటించారు. ఇక ఈనెల 16వతేదీ నుండి నూతన మద్యం విధానంతో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు అధికారంలో లేని వైసీపీ.. ఏమి మారలేదు.. అవే బ్రాండ్స్, అవే ధరలు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టింది. అయితే మందుబాబులు కూడా షాపుల వద్ద మద్యం సీసాలను కొనుగోలు చేసి, కేవలం ఒకటి, రెండు బ్రాండ్ మద్యం ధరలు తగ్గాయని, ధరల్లో ఆశించిన మార్పు లేదంటూ తెలుపుతున్నారు.
అలాగే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆన్ లైన్ చెల్లింపులు ఉండేవి కావని, ప్రస్తుతం ఆ చెల్లింపులకు ఆస్కారం ఉండడంతో క్యూలైన్ లో నిలబడాల్సిన పని లేకుండా పోయిందంటూ తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు మందుబాబులు. అలాగే ఏ బ్రాండ్ కోరితే ఆ బ్రాండ్ క్షణాల్లో ఇస్తున్నారని, కానీ ప్రభుత్వం ఆ ఒక్కహామీ పూర్తి చేయాలన్న డిమాండ్ మందుబాబుల వద్ద వినిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా మందుబాబుల డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తమ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం.. కొన్నింటిని తీర్చినా, ధరల విషయంలో పునరాలోచించాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.
అయితే పాత స్టాక్ ఉండడంతోనే ఆ ధరలకు విక్రయిన్నారన్న వాదన కూడా వైరల్ అవుతోంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యం విధానం పట్ల మద్యం ప్రియులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఆ ఒక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరుతున్నారు. మరి మందుబాబుల డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందో వేచిచూడాలి.