AP Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం కేసు జోరందుకుందా? ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కంటిన్యూ అవుతుందా? ఈ జాబితాలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేరిపోయారా? సిట్ సూచనలతో ఆయన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా? రానున్న రోజుల్లో మరికొందరి ఆస్తులు జప్తు కానున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. తాజాగా ఈ జాబితాలోకి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు ఆయన ఫ్యామిలీ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తు చేయనున్నారు అధికారులు.
అలాగే కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చింది. మద్య కుంభకోణంలో చెవిరెడ్డి ఫ్యామిలీ కమీషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడ బెట్టినట్లు సిట్ గుర్తించింది. దాదాపు రూ.54.87 కోట్లను బ్లాక్ మనీగా మార్చినట్లు తేల్చింది సిట్. ఆ నిధులకు సంబంధించి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.
చెవిరెడ్డి ఆస్తుల జప్తుకు ఆదేశాలు
అధికారం అండతో మోసపూరితంగా లావాదేవీలు చేసినట్లు గుర్తించింది. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. అవినీతి నిరోధక, నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది కూడా. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా చెవిరెడ్డి ఫ్యామిలీ ఖంగుతింది.
ALSO READ: సత్యసాయి అంటే ఆధ్యాత్మిక తేజస్సు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇప్పటికే కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేసింది. ఇప్పుడు చెవిరెడ్డి వంతైంది. 2019-24 మధ్యకాలంలో మద్యం కుంభకోణం జరిగింది. నకిలీ బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసింది. ఆ కేసులోని నిందితులు వచ్చిన డబ్బులతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. వాటికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించింది సిట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు తేలింది.