Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరుసటి రోజు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు నడిచేందుకు తెర వెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎయిర్ ట్రావెలర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు విశాఖ నగరానికి చేరుకుంటున్నాయి.
భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ-భోగాపురం ఎయిర్‌పోర్టు ఆగష్టు ఒకటి నుంచి ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఎయిర్‌పోర్టులో పెండింగ్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభమైన రెండో రోజు నుంచి సర్వీసులు నడపాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌ట్రావెలర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రావెలర్ల కోసం 100 ఏసీ బస్సులు-విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వచ్చే రహదారుల పెండింగ్ పనులు జోరందుకున్నాయి. కేవలం 10 రోజులు ఉండడంతో డే అండ్ నైట్ పనుల్లో జోరు పెరిగింది. విశాఖ సిటీతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వచ్చేందుకు 100 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఆగష్టు ఒకటి నాటికి అందుబాటులో 20 బస్సులు-భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 20 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. ఇప్పటివరకు 7 ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ సిటీకి చేరుకున్నాయి. మరో 13 బస్సులు జూలై 25 నాటికి చేరుకోనున్నాయి.
10 బస్సులు గాజువాక నుంచి ఎన్ఏడీ మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నాయి. మరో 10 బస్సులు సింధియా మీదుగా రైల్వేస్టేషన్-రుషికొండ, భోగాపురం ఎయిర్ పోర్టుకు ట్రావెల్ చేయనున్నాయి. 20 ఎలక్ట్రిక్ బస్సులను ఆగస్టు ఒకటిన ప్రధాని మోదీ-సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
బస్సుల్లో ప్రత్యేక సదుపాయాలు-ఎలక్ట్రిక్ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నారు. ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లోపల సీసీ కెమెరాలు, బస్సు స్టేజ్ వచ్చినప్పుడు ప్రత్యేకమైన మైకులు సిద్ధం చేశారు.
ALSO READ: సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం
మిగతా 80 బస్సులు విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు కాకుండా బయట తిప్పేలా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలమంచిలి, అనకాపల్లి, విజయనగరం నుంచి ఎయిర్ ప్రయాణికులు వచ్చేలా చూడనున్నారు. అయితే ఛార్జీలు ఎలా ఉంటాయి? మరోవారంలో ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించనుంది. ఈ బస్సులు ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్లు నడుపుతారు. కండక్టర్లు ఆర్టీసీకి చెందినవారు ఉంటారు.
భోగాపురంలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్, సిబ్బంది కోసం విశ్రాంతి గదులు సిద్ధం చేశారు. ద్వారకా బస్సుస్టేషన్, మద్దిలపాలెం, చోడవరం, కొత్తవలస, ఎలమంచిలి ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే వాటికి పవర్ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా లైన్లు సైతం వేశారు.