AP Mega DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు. అసలు ప్లాన్ ప్రకారం రేపు (శుక్రవారం) ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్యులు నారా లోకేశ్ సమక్షంలో అసెంబ్లీ భవనానికి వెనుక భాగంలో ఉన్న ప్రాంగణంలో.. నియామక పత్రాల పంపిణీ జరగాల్సింది. కానీ వర్షాల దెబ్బకు ప్రాంగణం కార్యక్రమానికి అనువుగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయక తప్పలేదు.
రెండు రోజుల కిందటే విడుదలైన ఫైనల్ సెలక్షన్ లిస్ట్
గత రెండు సంవత్సరాలుగా వేలాది మంది అభ్యర్థులు.. ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ అయినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేరు ఎంపికయ్యిందో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in ను సందర్శించవచ్చు.
వర్షాల కారణంగా వాయిదా తప్పలేదు
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల తీవ్రత.. అసెంబ్లీ వెనుక ప్రాంగణం బురదమయం అయ్యింది. పెద్ద ఎత్తున జనాలు పాల్గొనే కార్యక్రమం కావడంతో.. భద్రతా కారణాల రీత్యా వేదికను సిద్ధం చేయడం కష్టమైంది. అందుకే ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో తేదీని నిర్ణయించి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం.. ఘనంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
అభ్యర్థుల్లో ఆత్రుత
ఈ నియామక పత్రాల కోసం ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి సంతోషంగా ఉన్నా, మరోవైపు నియామక పత్రాలు అందుకోవడంలో ఆలస్యం రావడం వారిని కొంత నిరాశకు గురి చేస్తోంది.
నారా లోకేశ్ హామీ
ఫైనల్ లిస్ట్ విడుదల సమయంలో.. మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంచాయి. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. 16,347 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేశాం. త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాం అని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రకటనతో అభ్యర్థులు కొంత ఊరటనిచ్చాయి.
ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టి
ఈసారి మెగా డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్ నియామకాలు జరగడం.. రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగానికి ఊతం ఇస్తుందని విద్యా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ కావడంతో.. పాఠశాలలలో బోధన నాణ్యత మెరుగుపడనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించడానికి.. ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి.
త్వరలో కొత్త తేదీ ప్రకటించే అవకాశం
ప్రభుత్వం వాయిదా వేసిన నియామక పత్రాల పంపిణీ కోసం.. మరో కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనుంది. వాతావరణ పరిస్థితులు సర్దుకున్న తర్వాత, అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాజరయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ లిస్ట్ చెక్ చేసుకోవాలి.
నియామక పత్రాల పంపిణీకి సంబంధించిన కొత్త తేదీ ప్రకటన కోసం అధికారిక ప్రకటనలపై దృష్టి పెట్టాలి.
Also Red: మావోయిస్టుల మరో సంచలన లేఖ.. ఓటమిని ఒప్పుకుంటున్నాం
సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌కి లోనుకాకుండా, ప్రభుత్వం లేదా విద్యాశాఖ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.