BigTV English
Advertisement

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

Donald Trump: మొన్నటికి మొన్న అమెరికా మళ్లీ న్యూక్లియర్ టెస్టులు చేస్తుందని ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి.. పాకిస్థాన్ కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని ట్రంప్ ప్రకటించడం వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే.. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల పరీక్షలకు సంబంధించి ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇప్పుడు.. పాకిస్థాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేస్తోందని ట్రంప్ చెప్పడం చూస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయో అర్థమవుతోంది. నిజంగానే.. పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందా?


అణు ఉద్రిక్తతలను మరింత పెంచిన ట్రంప్ కామెంట్
అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్న అనేక దేశాల్లో.. పాకిస్థాన్ కూడా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటికే ఉన్న అణు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించి.. ఈ ప్రపంచానికి కొత్త సవాల్ విసిరారు ట్రంప్. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే.. రష్యా, చైనా, నార్త్ కొరియా, పాకిస్థాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని.. ఓ న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే.. ఆ దేశాలు న్యూక్లియర్ టెస్టుల గురించి బయటకు చెప్పట్లేదని.. తాము అలా కాదని.. ఏదైనా బహిరంగంగానే మాట్లాడతామని ట్రంప్ అన్నారు. ఇన్నాళ్లూ ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా.. వాటి జోలికి వెళ్లలేదన్నారు ట్రంప్. ఇకపై.. అలా మిగిలిపోవాలనుకోవట్లేదని.. ఇతర దేశాల మాదిరిగానే తామూ.. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తామన్నారు ట్రంప్.

అమెరికా దగ్గరే ఎక్కువ అణ్వస్త్రాలు ఉన్నాయన్న ట్రంప్
రష్యా, చైనా దగ్గర చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయని.. అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. తమ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్‌తో.. ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చన్నారు. అయితే.. అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానని ట్రంప్‌ తెలిపారు. అమెరికాలో అణ్వాయుధ పరీక్షలకు ఏర్పాట్లు ప్రారంభమైనట్లు స్పష్టం చేశారు. అయితే.. ఎప్పుడు, ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. సౌత్ కొరియాలోని బుసాన్‌లో.. ఇటీవల చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్‌తో భేటీకి ముందు.. ట్రంప్ ట్రూత్ సోషల్‌లో అణ్వాయుధ పరీక్షల గురించి పోస్ట్ చేశారు.


అన్ని దేశాలు అణు సామర్థ్యాలు పెంచుకుంటున్నాయన్న ట్రంప్
అణ్వస్త్రాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా.. పరీక్షలు చేయకూడదని.. తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు ట్రంప్. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయని, రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయన్నారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముందని.. అందుకోసమే.. అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందన్నారు. అమెరికన్ ఆయుధ వ్యవస్థల విశ్వసనీయతను నిర్ధారించడానికి.. పరీక్షలు అవసరమని చెబుతున్నారు ట్రంప్. ఉత్తర కొరియా తప్ప మరే దేశం.. దశాబ్దాలుగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. చాలా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నారని ట్రంప్ చెబుతున్నారు. ప్రస్తుత చర్చలు అణు విస్ఫోటనాలను రాకుండా.. నాక్ క్రిటికల్ సిస్టమ్ పరీక్షలను సూచిస్తున్నాయ్.

చివరిసారిగా 1998లో పాకిస్థాన్‌లో అణ్వాయుధ పరీక్షలు
పాకిస్థాన్ చివరిసారిగా అధికారికంగా 1998లో అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది. భారత్.. పోఖ్రాన్-2 అణు పరీక్షలకు కౌంటర్‌గా.. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని రాస్ కోహ్ కొండల్లో.. అణు పరీక్షలు నిర్వహించింది. దాంతో.. పాకిస్థాన్ ప్రపంచంలో అణ్వాయుధ పరీక్షలు చేసిన ఏడో దేశంగా నిలిచింది. ప్రస్తుతం.. పాకిస్థాన్ దగ్గర సుమారు 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనే అంచనాలున్నాయి. అదే.. పాకిస్థాన్.. భారత్ మాదిరిగా మొదటగా ఉపయోగించకూడదనే.. విధానాన్ని పాటించదు. దూకుడుగా దాడి జరిగిన సమయంలో.. తన ప్రయోజనాలను రక్షించుకునేందుకు.. తమ ఆయుధశాలలోని ఏ ఆయుధాన్నైనా ఉపయోగిస్తామని పాకిస్థాన్ గతంలోనే ప్రకటించింది. పైగా.. పాకిస్థాన్ అణు నిరాయుధీకరణ ఒప్పందం, సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందంపైనా సంతకం చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహిస్తోందని ట్రంప్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయ్.

భారత అణు పరీక్షలకు ప్రతిస్పందనగా పాక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్
నిజానికి.. పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్.. ప్రధానంగా భారతదేశ అణు పరీక్షలకు ప్రతిస్పందనగా మొదలైంది. ఇందుకు అనేక కారణాలున్నాయ్. 1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓటమిపాలవడం, ఆ తర్వాత మూడేళ్లకే భారత్ 1974లో తన మొదటి అణు పరీక్ష పోఖ్రాన్-1 నిర్వహించిన తర్వాత.. అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అణు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారికంగా 1998 మే 28, మే 30న.. 5 భూగర్భ పరీక్షలు నిర్వహించింది పాక్. దీంతో.. పాక్ అధికారికంగా అణ్వాయుధ శక్తి కలిగిన దేశంగా మారింది. అయితే.. పాకిస్థాన్ ప్రతి సంవత్సరం 14 నుంచి 27 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయగల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుందని.. రిపోర్టులు చెబుతున్నాయి. పాకిస్థాన్ తన అణ్వాయుధాలను మోసుకెళ్లేందుకు.. వివిధ రకాల మిసైల్ సిస్టమ్స్‌ని డెవలప్ చేసింది. భారత్‌కు చెందిన సంప్రదాయ సైనిక ఆధిక్యతని ఎదుర్కొనేందుకు, నిరోధించేందుకు.. పాకిస్థాన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌పై దృష్టిసారించింది.

పాకిస్థాన్ అణ్వస్త్ర పరీక్షలు చేయట్లేదు అనుకోవడానికి.. ఆ మాట చెప్పింది ఎవరో దారినపోయే దానయ్య కాదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికాకు ఉన్న ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల.. పాకిస్థాన్ నిజంగానే అణ్వస్త్ర పరీక్షలు మొదలుపెట్టి ఉండొచ్చనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే.. పాక్ ఎందుకోసం ఇప్పుడు అణ్వస్త్ర పరీక్షలు చేస్తోంది? ఇప్పటికిప్పుడు రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? న్యూక్లియర్ వార్ హెడ్‌లని పెంచుకునే ప్రయత్నమా? మరేదైనా సంకేతమా?

పాకిస్థాన్ లో అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు?
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్‌తో.. పాకిస్థాన్ అణ్వస్త్ర పరీక్షలు చేస్తోందనే అంశం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ లాంటి దేశాలు అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయని.. అందుకే.. వాటి గురించి ప్రపంచానికి తెలియట్లేదన్నారు. ఇతర దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేస్తుంటే.. అమెరికా అణ్వస్థ పరీక్షలు చేయకుండా ఉండదన్నారు. యూఎస్ ఆయుధ వ్యవస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవడానికి పరీక్షలు అవసరమని వాదిస్తున్నారు. అయితే.. ట్రంప్ చెబుతున్నట్లు పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధ పరీక్షలు చేయడానికి కొన్ని కీలక కారణాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. న్యూక్లియర్ వార్‌హెడ్‌ల ఆధునీకరణతో పాటు అణ్వస్త్రాల సామర్థ్యాన్ని పెంచడానికి, వ్యూహాత్మక అణ్వస్త్రాల తయారీకి, సరికొత్త టెక్నాలజీని టెస్ట్ చేయడానికి.. న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేస్తుండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

కొత్త మిసైల్ సిస్టమ్స్‌కు అనుగుణంగా వార్ హెడ్‌ల రూపకల్పన
నూతన మిసైల్ సిస్టమ్స్‌కు అనుగుణంగా.. వార్ హెడ్‌ల రూపకల్పన, పనితీరును మెరుగుపరచడం కూడా ఓ కారణమై ఉండొచ్చు. అంతేకాదు.. భారత్‌, అప్ఘానిస్థాన్‌ నుంచి ముప్పు ఉందని భావించి.. దానిని ఎదుర్కొనేందుకు కనీస విశ్వసనీయ నిరోధకత సిద్ధాంతాన్ని కొనసాగించే ఆలోచనతోనే.. పాకిస్థాన్ రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు మొదలుపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. అంతర్జాతీయ సమాజానికి తమ అణ్వస్త్ర సామర్థ్యం బలంగా ఉందని.. తమ రక్షణకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని పంపడం కూడా పాక్ వ్యూహంలో భాగమై ఉండొచ్చంటున్నారు.

చివరగా 1998లో పాక్‌లో బహిరంగ అణు పరీక్షలు
పాకిస్థాన్ చివరగా 1998లో బహిరంగంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా అణు పరీక్షలను నిషేధించే.. సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగింది. పాకిస్థాన్.. ఈ ఒప్పందంపై సంతకం చేయకపోయినప్పటికీ.. నార్త్ కొరియా మినహా అన్ని దేశాలు బహిరంగ అణు పరీక్షలు నిలిపివేశాయ్. అందువల్ల.. పాకిస్థాన్ రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు చేస్తోందనే ట్రంప్ కామెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ పాకిస్థాన్ గనక బహిరంగంగా అణు పరీక్ష చేస్తే.. దానిపై ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాల నుంచి తీవ్ర ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అందువల్ల.. అణు పరీక్షలు చేయకుండా ఉండే అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించకుండా.. తమ ఆయుధాలను ఆధునీకరించడానికి రహస్యంగా పరీక్షలు జరుపుతుండొచ్చనే చర్చ జరుగుతోంది.

అణ్వస్త్రాలకు సంబంధించి భారత్, పాక్ మధ్య ఒప్పందం
అణ్వస్త్రాలకు సంబంధించి.. భారత్, పాక్ మధ్య ఒక ఒప్పందం ఉంది. రెండు దేశాలూ.. ఒకరి అణు స్థావరాలు, సదుపాయాలపై దాడి చేయబోమని అంగీకరించాయి. ఏటా జనవరి 1న.. తమ అణు స్థావరాలు, సదుపాయాల జాబితాలను.. దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకుంటాయి. ఇది.. 1992 నుంచి నిరంతరంగా కొనసాగుతోంది. అణు ప్రమాదాలను తగ్గించేందుకు, ముందస్తు నోటీసులు ఇవ్వడానికి సంబంధించి.. 1999లో లాహోర్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ అగ్రిమెంట్ కుదిరింది. అయితే.. భారత్ నో ఫస్ట్ యూజ్ విధానానికి విరుద్ధంగా.. పాకిస్థాన్ ఫస్ట్ యూజ్ విధానం ఉంటుంది. దీనివల్ల.. చిన్న స్థాయి సైనిక ఘర్షణ కూడా అణ్వస్త్రాల స్థాయికి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు.. పాకిస్థాన్ డెవలప్ చేస్తున్న టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్.. యుద్ధ భూమిలో నిర్ణయం తీసుకునే సమయాన్ని తగ్గిస్తాయి. ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.

భారత సైనిక ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకే పాకిస్తాన్ చర్యలు
భారత సైనిక ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకే.. పాకిస్థాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల.. ఆ దేశం తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే చాన్స్ ఉంది. అంతేకాదు.. కొత్త అణ్వాయుధాలను పరీక్షించి.. వాటి సంఖ్యని పెంచుకుంటే.. ప్రాంతీయంగా ఉన్న శక్తుల సమతుల్యత దెబ్బతింటుంది. పాకిస్థాన్ సామర్థ్యం పెరిగితే.. భారత్ తన కనీస విశ్వసనీయత నిరోధకత సిద్ధాంతాన్ని కొనసాగించేందుకు అదనపు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. న్యూక్లియర్ టెస్టులు.. సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతల్ని పెంచుతాయి. పైగా.. పొరుగు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని పెంచేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా.. పాకిస్థాన్ దుందుడుకు వైఖరి.. ఈ విషయంలో భారత్‌ని రెచ్చగొట్టేలా ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత.. భారత్ కూడా పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని నిశితంగా, జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అవసరమైతే.. అగ్ని సిరీస్ మిసైళ్లతో.. కొత్త తరం అణ్వాయుధ సామర్థ్యం గల మిసైళ్లని అభివృద్ధి చేసి మోహరించడం చేసే అవకాశం ఉంది.

Also Read: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

భూమి, సముద్రం, గాలి ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని భారత్ కూడా కొనసాగిస్తుంది. వీటికంటే ముందు.. ట్రంప్ ఆరోపించినట్లుగా రహస్య పరీక్షలు జరుగుతున్నాయా? లేదా? అని తెలుసుకోవడానికి.. పాకిస్థాన్ అణ్వాయుధాలు, మిసైళ్ల అభివృద్ధి కార్యకలాపాలపై భారత్ నిఘా పెంచాల్సిన అవసరముందనే చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ గనక రహస్యంగా అణు పరీక్షలు చేస్తున్న విషయం నిజమని తేలితే మాత్రం.. భారత్ మరింత అప్రమత్తమవుతుంది. మన ప్రభుత్వం కూడా అణ్వాయుధ నిరోధకతను మరింత బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా మిసైల్ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుంది.

Story By Anup, Bigtv

Related News

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం

Netherlands Next Prime Minister: నెదర్లాండ్ కు తొలి ‘గే’ ప్రధానమంత్రి.. ఎవరీ రాబ్ జెట్టెన్?

Supermarket Explosion: సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది స్పాట్‌డెడ్

Kenya Landslide: విరిగిపడిన కొండ చరియలు.. 21 మంది మృతి

Big Stories

×