Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ రూటు మార్చిందా? కేవలం సెటిలర్స్ ఓట్లపై ఫోకస్ చేసిందా? ఇప్పటికే ఏపీలోని కూటమి పార్టీల మద్దతుదారులతో ఆ పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నారా? గోపీనాథ్ మాదిరిగా సునీతకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారా? సెటిలర్స్ ఓట్లు ఎటువైపు తిరిగితే వారు విజయం సాధిస్తారని నేతలు బలంగా నమ్ముతున్నారు.
బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు నిల బెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఆ నియోజకవర్గంలో తమకు 25-30 శాతం ఓటు బ్యాంకు బలంగా ఉందని నమ్ముతోంది. 10 శాతం ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే సునాయాశంగా విజయం సాధించవచ్చని ఆ పార్టీ నేతల మాట.
అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికను అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. సెటిలర్స్ ఓట్లుపై ఫోకస్ చేయాలని, అందుకు ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చేశారట.
వాళ్లనే టార్గెట్ చేసిందా?
మార్నింగ్ ఇంటింటికి ప్రచారం చేసేందుకు కొందరు నేతలతో ఒక టీమ్. సాయంత్రం ముఖ్యనేతలతో రోడ్ షోలకు మరొక టీమ్. రాత్రి వేళ సెటిలర్స్ కోసం మరో టీమ్ వర్కౌట్ చేస్తోందని అంటున్నారు. తొలుత కుల సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్నవారిని పార్టీకి ఆహ్వానించింది. అదే సమయంలో నియోజకవర్గంలో బలం ఉండి పోటీ చేయని పార్టీల నేతలపై ఫోకస్ చేసిందట కారు పార్టీ.
ఏపీ విడిపోయిన తర్వాత తర్వాత మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపున గెలిచారు. ఆ తర్వాత రాజకీయ కారణాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లినా, స్థానికంగా ఉండే టీడీపీ నేతలు, సానుభూతిపరులతో మంచి సంబంధాలు కొనసాగించారు. ఆ ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.
ALSO READ: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. రెండురోజుల్లో భారీ వర్షాలు
రాజకీయ కారణాలతో టీడీపీ హైకమాండ్ వేరే పార్టీలకు మద్దతు ప్రకటించినా, స్థానికంగా ఉండే ఆ పార్టీ కేడర్ తనకు మద్దతు ఇస్తుందని సమయం, సందర్భం వచ్చినప్పుడు గోపీనాథ్ చెప్పేవారు. ఇప్పుడు ఆ ఫార్ములాను వర్కౌట్ చేయాలని ఆలోచన చేస్తోందట. టీడీపీ ఓట్లు.. కాంగ్రెస్-బీజేపీ వైపు వెళ్లకుండా ప్రచారంలో రకరకాల ఎత్తుగడలను వేస్తోంది బీఆర్ఎస్. గతంలో టీడీపీకి అనుకూలంగా బీఆర్ఎస్ నేతలు మాటల వీడియోలను తెరపైకి తీసుకొచ్చింది.
వైసీపీ మద్దతుదారుల ఓట్లు కచ్చితంగా తమకే పడతాయని బలంగా నమ్ముతున్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఈ క్రమంలో కూటమి పార్టీలపై ఫోకస్ చేసినట్టు కిందిస్థాయిలో గుసగుసలు లేకపోలేదు. టీడీపీ-జనసేన క్యాడర్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందట. గోపీనాథ్ తరహాలో సునీతకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. ఈ నేపథ్యంలో కూటమిలోని బీజేపీని కాదని టీడీపీ-జనసేన కేడర్.. బీఆర్ఎస్ వైపు ఎంతవరకు మొగ్గు చూపుతుందో చూడాలి.