పులివెందుల. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. సార్వత్రిక ఎన్నికల్లోకంటే ఇప్పుడే ఈ పేరు మారుమోగిపోతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా పులివెందుల ZPTC ఎన్నిక ట్రెండింగ్ లో ఉంది. ఓటుకి 10వేల రూపాయలు ఇస్తున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఒక సాధారణ ZPTC స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక చుట్టూ ఉంత రచ్చ దేనికి? కూడా పోలింగ్ పూర్తవుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల పేరు ఎందుకు చర్చనీయాంశం అవుతోంది?
30ఏళ్ల తర్వాత..
ఎన్నిక అయినా, ఉప ఎన్నిక అయినా అక్కడ బ్యాలెట్ ఉండదు. 30 ఏళ్లుగా జరుగుతున్న తంతు ఇదే. ఎప్పుడు ఎన్నికలు జరగాలన్నా వైఎస్ కుటుంబం అక్కడ ఓ అభ్యర్థిని నిలబెడుతుంది. అతడే విజేత, అతడినే ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకుంటారు. ప్రత్యర్థులు భయపడి నామినేషన్ వేసేందుకే రారు, ఒకవేళ వేసినా విత్ డ్రా చేసుకోడానికి ఏమాత్రం మొహమాటపడరు. పోనీ వైఎస్ కుటుంబం నిలబెట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా నామినేషన్ వేసి, ఎన్నికల్లో పోటీ చేసినా, పోలింగ్ జరిగిన మరుసటి రోజే ఆ గట్టునుంచి ఈ గట్టుకి చేరిపోతారు. అలాంటి పరిస్థితులు ఉన్న పులివెందులలో ఇప్పుడు అసలు రాజకీయం మొదలైంది. వైసీపీ అధినేత జగన్ నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా కూటమి అభ్యర్థి బరిలో దిగారు. ప్రచారంలో కూడా ఎక్కడా ఎవరూ తగ్గలేదు. చివరకు పోలింగ్ రోజు కూడా నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ పరిస్థితులున్నాయి. అరెస్ట్ లు, గొడవలు, లాఠీచార్జ్ లు.. పులివెందుల టాక్ ఆఫ్ ది ఏపీగా మారిపోయింది. మూడు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.
పులివెందుల పులి..?
పులివెందుల పులిగా జగన్ ని కీర్తిస్తుంటారు వైసీపీ నేతలు, అభిమానులు. అయితే ఈ ట్యాగ్ లైన్ కి ఈ ఎన్నిక జస్టిఫికేషన్ గా మారుతుందా లేదా అనేది ఫలితంతో తేలిపోతుంది. వాస్తవానికి ఏకగ్రీవం కాకుండా కూటమి అభ్యర్థి పోటీకి దిగడంతోనే పులివెందుల ఏ ఒక్కరి సొత్తు కాదనే విషయం తేలిపోయింది. ఎన్నికల ఫలితంతో ఇక్కడ ఎవరి బలం ఎంతో బయటపడుతుంది. 2021లో పులివెందుల జడ్పీటీసీ స్థానం వైసీపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి ఏకగ్రీవం అయింది. ఆయన మరణంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన తనయుడు హేమంత్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది, సింపతీ ఓటుపై నమ్మకం పెట్టుకుంది. టీడీపీ అభ్యర్థిగా లతారెడ్డి పోటీలో ఉన్నారు. వైసీపీ తరపున గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ నేతలు ప్రచారం చేశారు. ఇటు కూటమి తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేత బీటెక్ రవి ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. కూటమి ఏడాది పాలనకు పులివెందుల ఉప ఎన్నికల ప్రతిబింబంగా నిలుస్తుందని భావిస్తున్నారు టీడీపీ నేతలు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో అరెస్ట్ లు, నిర్బంధాలు, లాఠీచార్జ్ లు అనివార్యంగా మారాయి. చివరకు పోలింగ్ రోజు కూడా గొడవలు ముదిరాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయినా కూడా టీడీపీ, వైసీపీ నేతలు పోలీసుల ముందే గొడవ పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం ఇక్కడ విశేషం. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆయన తప్పించుకుని వెళ్లిపోవడం, చివరకు పోలీసులు ఆయనతో చర్చలు జరపడం పోలింగ్ డే హైలైట్ గా మారింది. మరోవైపు వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7గం.లకు ప్రారంభమైన దగ్గర నుంచీ పెద్ద అరాచకం రాజ్యమేలుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఓటర్లు బూతుల్లోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసి కట్టుగా కుట్రను అమలు చేస్తున్నారు. వెళ్లిన మా ఏజెంట్లను తెలుగుదేశం… pic.twitter.com/Suld0F0OPE
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
ఈ ఉప ఎన్నికలను టీడీపీ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించడం విశేషం. 30ఏళ్లుగా ఎవరినీ పోటీ చేయనీయకుండా వైఎస్ కుటుంబం ఏకగ్రీవాలతో పులివెందులను తమ గుప్పెట్లో పెట్టుకుందని, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చాయంటూ టీడీపీ వరుస ట్వీట్లు వేస్తోంది. కూటమి ఏడాది పాలనపై పులివెందుల ఫలితం ప్రభావం చూపిస్తుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ZPTC ఎన్నికల్లో ఓటు వేయడానికి పోటెత్తడం ఆసక్తికర పరిణామం.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు 30 ఏళ్ళ తర్వాత ఇన్నాళ్లకు స్వేచ్ఛగా పోలింగ్ బూత్ లకు వెళ్లి పోలింగ్ లో పాల్గొంటున్నారు. కూటమిపాలనలో ఇది పులివెందుల ప్రజలకు దక్కిన ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నారు. దీన్ని తట్టుకోలేని వైసీపీ నేతల తమ రౌడీలతో అల్లర్లకు తెగబడటమే కాకుండా… pic.twitter.com/vWXyGVuTVr
— Telugu Desam Party (@JaiTDP) August 12, 2025